Ravichandran Ashwin: ఉదయం షూ లేసులు కూడా కట్టుకోలేకపోయాడు... మ్యాచ్ ను డ్రా చేశాడంటే నమ్మలేకపోతున్నాను: అశ్విన్ పై భార్య వ్యాఖ్యలు
- సిడ్నీలో టీమిండియా, ఆసీస్ మూడో టెస్టు డ్రా
- అద్భుతంగా ఆడిన అశ్విన్
- గతరాత్రి అశ్విన్ వెన్నునొప్పితో బాధపడ్డాడని వెల్లడించిన ప్రీతి
- ఉదయం నిటారుగా నిలబడలేకపోయాడని వివరణ
ఆస్ట్రేలియాతో సిడ్నీ టెస్టును టీమిండియా డ్రా చేసుకున్న తీరు విమర్శకుల ప్రశంసలకు నోచుకుంది. ఈ క్రమంలో, మ్యాచ్ డ్రాగా ముగియడంలో టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలకపాత్ర పోషించాడు. అశ్విన్ 128 బంతులాడి 39 పరుగులు చేశాడు. తెలుగు తేజం హనుమ విహారి (161 బంతుల్లో 23 పరుగులు)తో కలిసి అజేయ భాగస్వామ్యంతో టీమిండియాను సురక్షిత స్థితికి చేర్చాడు.
ఈ నేపథ్యంలో అశ్విన్ గురించి ఆయన భార్య ప్రీతి ఆసక్తికర అంశం వెల్లడించింది. గతరాత్రి అశ్విన్ తీవ్ర వెన్నునొప్పితో బాధపడ్డాడని, ఇవాళ ఉదయం నిటారుగా నిలబడలేకపోయాడని వివరించింది. కనీసం కిందకు వంగి షూ లేసులు కూడా కట్టుకోలేకపోయాడని, అలాంటివాడు సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ ను డ్రా దిశగా మళ్లించాడంటే నమ్మశక్యం కావడం లేదని తెలిపింది.
ప్రీతినే కాదు, భారత మాజీ క్రికెటర్లందరూ సిడ్నీ టెస్టు ఫలితంపై టీమిండియాను వేనోళ్ల కొనియాడుతున్నారు. ముఖ్యంగా, 256 బంతులు ఎదుర్కొని 62 పరుగులు చేసి భారత్ ను గట్టెక్కించిన విహారి, అశ్విన్ జోడీపై ప్రశంసల జడివాన కురుస్తోంది. వీరిద్దరూ స్టార్క్, కమ్మిన్స్, హేజెల్ వుడ్ విసిరిన బుల్లెట్ బంతులను ఎదుర్కొని మ్యాచ్ ను కాపాడుకున్న తీరు అమోఘం అని వేనోళ్ల కొనియాడుతున్నారు.