Passport: ప్రపంచంలో శక్తిమంతమైన పాస్ పోర్ట్ జపాన్దే!
- వీసా లేకుండా 191 దేశాలకు
- హెన్లీ రిపోర్ట్ లో మొదటి స్థానం
- 58 దేశాలతో మన పాస్ పోర్ట్ కు 85వ ర్యాంక్
విదేశాలకు వెళ్లాలంటే వీసా తప్పనిసరి. వీసా కావాలంటే పాస్ పోర్ట్ ఉండి తీరాల్సిందే. అయితే, కొన్ని పాస్ పోర్ట్ లతో వీసా లేకుండానే ఎన్నెన్నో దేశాలకు వెళ్లొచ్చు. వెళ్లాక అక్కడే నేరుగా వీసా తీసుకోవచ్చు. ఆ జాబితాలో ఎప్పటిలాగానే జపాన్ పాస్ పోర్ట్ ప్రథమ స్థానాన్ని నిలబెట్టుకుంది. హెన్లీ అండ్ పార్ట్ నర్స్ విడుదల చేసిన అత్యంత శక్తిమంతమైన పాస్ పోర్ట్స్ జాబితాలో జపాన్ ముందు నిలిచింది. ఆ పాస్ పోర్ట్ తో ముందస్తు వీసా లేకుండానే 191 దేశాలకు వెళ్లిపోవచ్చు.
ఈ జాబితాలో భారత్ పాస్ పోర్ట్ 85వ ర్యాంకును సాధించింది. మన పాస్ పోర్ట్ తో ముందస్తు వీసా లేకుండా 58 దేశాలకు వెళ్లొచ్చు. గతేడాది 84వ స్థానంలో ఉండగా.. ఇప్పుడు ఓ స్థానం కిందకు పడిపోయింది. ఇండియాతో పాటు తజకిస్థాన్ సంయుక్తంగా 85వ ర్యాంకును పొందింది.
కాగా, 190 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం ఉన్న సింగపూర్ పాస్ పోర్ట్ రెండో స్థానాన్ని దక్కించుకుంది. జర్మనీ, దక్షిణ కొరియా (189) మూడు, ఫిన్లాండ్, ఇటలీ, లగ్జెంబర్గ్, స్పెయిన్ (188) నాలుగో స్థానం, ఆస్ట్రియా, డెన్మార్క్ (187) ఐదో స్థానంలో నిలిచాయి.
ఆరో స్థానంలో ఫ్రాన్స్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, పోర్చుగల్, స్వీడన్ (186), ఏడో స్థానంలో బెల్జియం, న్యూజిలాండ్, నార్వే, స్విట్జర్లాండ్, బ్రిటన్, అమెరికా (185), ఎనిమిదో స్థానంలో ఆస్ట్రేలియా, చెక్ రిపబ్లిక్, గ్రీక్, మాల్టా (184), తొమ్మిదో స్థానంలో కెనడా (183), పదో స్థానంలో హంగరీ (182) నిలిచాయి.