Chandrababu: భోగి మంటలు వెలగాల్సిన కూడళ్లలో అన్నదాతల గుండె మంటలా?: చంద్రబాబు
- వరుస విపత్తులతో రైతులు పూర్తిగా నష్టపోయారు
- రంగు మారిన ధాన్యాన్ని కొనేవారు కూడా లేరు
- కష్టాల్లో ఉన్న రైతును ప్రభుత్వం ఆదుకోవడం లేదు
వైసీపీ పాలనలో రైతులు తీవ్ర కష్టాలను అనుభవిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వరుసగా సంభవించిన ఏడు విపత్తుల వల్ల రైతులు పూర్తిగా నష్టపోయారని అన్నారు. వర్షాలకు రంగు మారిన ధాన్యాన్ని కొనేవాళ్లు కూడా లేరని మండిపడ్డారు. కర్నూలులో ఈరోజు టమోటాకు ధర లేకపోవడంతో రైతులు వాటిని రోడ్లపై పారబోశారని అన్నారు. కిలో టమోటా 30 పైసలకు కూడా కొనేవారు లేరని చెప్పారు. సంక్రాంతి వేళ రైతులకు ఈ కష్టాలు ఏమిటని ప్రశ్నించారు. భోగి మంటలు వెలగాల్సిన కూడళ్లలో అన్నదాతల గుండె మంటలా? అని ఆవేదన వ్యక్తం చేశారు.
టీడీపీ జోనల్ ఇన్ఛార్జిలు, పార్లమెంటు అధ్యక్షులు, సమన్వయకర్తలు, అసెంబ్లీ ఇన్ఛారీలతో చంద్రబాబు ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. గిట్టుబాటు ధర లభించకపోవడంతో తోటలను రైతులు దున్నేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. టన్ను అరటి ధర రూ. 8 వేల నుంచి రూ. 2 వేలకు పడిపోయిందని చెప్పారు. పంటలకు మద్దతు ధర లేక రైతు అల్లాడిపోతున్నాడని అన్నారు. కష్టాల్లో ఉన్న రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడం లేదని మండిపడ్డారు. రైతులకు వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.