Narendra Modi: వారసత్వ రాజకీయాలు నియంతృత్వ పాలనకు కొత్త రూపం: మోదీ
- యువత రాజకీయాల్లోకి రాకుంటే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది
- పూర్వీకులు చేసిన తప్పులకు శిక్షలు పడకుంటే వారసులు చెలరేగిపోతారు
- రాజకీయాల్లోకి వచ్చే యువతను ఒకప్పుడు చెడిపోయిన వారిగా చూసేవారు
- జాతీయ యువజన పార్లమెంటు ముగింపు వేడుకల్లో మోదీ
వారసత్వ రాజకీయాలు అత్యంత ప్రమాదకరమైనవని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన జాతీయ యువజన పార్లమెంటు ముగింపు వేడుకల్లో మోదీ నిన్న మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
రాజకీయాల్లో వారసులుగా ఉన్నత స్థానాల్లోకి వచ్చిన వారికి చట్టాలపై భయం, భక్తి ఉండవని అన్నారు. వారసత్వ రాజకీయాలు నియంతృత్వ పాలనకు కొత్త రూపమని అభివర్ణించారు. పూర్వీకులు చేసిన తప్పులకు శిక్ష పడకుంటే తమకు కూడా ఏమీ కాదన్న నమ్మకం పెరుగుతుందని, ఫలితంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని అన్నారు.
ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. వారు రాకుంటే వారసత్వ రాజకీయాలనే విషం ప్రజాస్వామ్యాన్ని మరింత బలహీనం చేస్తుందని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటి పేర్లతో ఎన్నికల్లో గెలిచే సంస్కృతి క్రమంగా బలహీన పడుతోందని, అయితే, పూర్తిగా పోలేదని అన్నారు.
వారసత్వ రాజకీయాల్లో దేశ ప్రయోజనాల కంటే ముందు నేను, నా కుటుంబం అనే వాటికే ప్రాధాన్యం లభిస్తుందన్నారు. ఒకప్పుడు రాజకీయాల్లో చేరిన యువతను చెడిపోయిన వారిగా చూసేవారని, ఇప్పుడా పరిస్థితి లేదని అన్నారు. ప్రజలు ఇప్పుడు నిజాయతీ గల నాయకులవైపే చూస్తున్నారని మోదీ అన్నారు.