Kim Jong Un: అమెరికాను తమ దేశ ప్రధాన శత్రువుగా ప్రకటించిన ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్
- కొత్తగా సబ్మెరైన్ లాంచ్ బాలిస్టిక్ మిస్సైల్ అభివృద్ధి
- భూభాగం వెలుపల ముందస్తుగా శత్రువులను గుర్తిస్తుందన్న ఉ.కొరియా
- వారిని పూర్తిగా నాశనం చేయగలమంటూ మీడియా వార్తలు
- శక్తిమంతమైన రాకెట్లు తమ వద్ద ఉన్నాయని ప్రకటన
అమెరికాను తమ దేశ ప్రధాన శత్రువుగా పేర్కొంటూ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రకటన చేశారు. అమెరికాలో కొన్ని రోజుల్లో కొత్త అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కొత్తగా ఆవిష్కరించిన సబ్మెరైన్ లాంచ్ బాలిస్టిక్ మిస్సైల్ ప్రదర్శనని పరిశీలించిన కిమ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్య చేశారు.
కాగా, తమ భూభాగం వెలుపల ముందస్తుగా శత్రువులను గుర్తించి, వారిని పూర్తిగా నాశనం చేసే శక్తిమంతమైన రాకెట్లు తమ వద్ద ఉన్నాయని ఈ సందర్భంగా ఉత్తర కొరియా మీడియా పేర్కొంది. సరిహద్దుల అవతల ఉన్న లక్ష్యాలనూ ఈ రాకెట్లు నాశనం చేస్తాయని తెలిపింది.
ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన సబ్మెరైన్ లాంచ్ బాలిస్టిక్ క్షిపణిని అభివృద్ధి చేసినట్లు పేర్కొంది. అలాగే, నీటి అడుగున నుంచి ఎన్నో ఎస్ఎల్బీఎంలను పరీక్షించినట్లు తెలిపింది. జలాంతర్గామిని అభివృద్ధి చేయాలని ఉత్తరకొరియా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అణ్వాయుధాలతో పాటు బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాల నిర్వహణపై ఉత్తర కొరియాపై అంతర్జాతీయంగా ఆంక్షలు ఉన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ, ఉత్తరకొరియా గతంలో అభివృద్ధి చేసిన పుక్గుక్సాంగ్-4 కు అప్డేటెడ్ వర్షన్ ను ప్రారంభించింది.