Gautam Sawang: ఆలయాల్లో ఘటనల వెనుక ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర కోణం దాగి ఉంది: డీజీపీ గౌతమ్ సవాంగ్
- మంగళగిరిలో డీజీపీ మీడియా సమావేశం
- ఆలయాలపై దాడుల పట్ల స్పందన
- 9 కేసుల్లో రాజకీయ ప్రమేయం ఉందని వెల్లడి
- సామాజిక, దృశ్య మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని వివరణ
ఏపీలో ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలపై రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ మంగళగిరిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీలో మతసామరస్యాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆలయాలపై దాడులకు సంబంధించిన కేసుల్లో సిట్ దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు.
ఆలయాల్లో ఘటనలకు సంబంధించి 9 కేసుల్లో రాజకీయ పార్టీల ప్రమేయం ఉన్నట్టు గుర్తించామని, ఆయా కేసుల్లో 15 మందిని అరెస్ట్ చేశామని సవాంగ్ తెలిపారు. ఘటనల వెనుక కుట్రకోణం దాగి ఉందా? అనే విషయమై దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆలయాలపై దాడుల పట్ల సామాజిక, దృశ్య మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.
ముఖ్యంగా, అంతర్వేది, రాజమండ్రి ఘటనల్లో తీవ్రస్థాయిలో దుష్ప్రచారం జరిగినట్టు డీజీపీ వెల్లడించారు. ఘటన జరిగిన ప్రతిసారీ ఈ విధంగా దుష్ప్రచారం చేస్తూ కొన్నిచోట్ల అల్లర్లు సృష్టిస్తున్నారని వివరించారు. పథకం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే దురుద్దేశం కనిపిస్తోందని పేర్కొన్నారు. గతంతో పోలిస్తే 2020లో ఆలయాల్లో జరిగిన ఘటనల సంఖ్యలో పెరుగుదల లేదని చెప్పారు.