Corona Vaccination: తొలిరోజు కరోనా వ్యాక్సినేషన్ విజయవంతం: కేంద్రం వెల్లడి
- దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభం
- 3,351 కేంద్రాల్లో వ్యాక్సినేషన్
- తొలిరోజున 1.65 లక్షల మందికి వ్యాక్సిన్
- టీకా తీసుకున్నవారెవరూ అనారోగ్యానికి గురికాలేదన్న కేంద్రం
భారత్ లో ఇవాళ తొలి దశ కరోనా వ్యాక్సినేషన్ విజయవంతం అయిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎవరూ అనారోగ్యానికి గురికాలేదని తెలిపింది. తొలిరోజు 1.65 లక్షల మందికి పైగా కరోనా వ్యాక్సిన్ అందించినట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వివరించింది. దేశవ్యాప్తంగా 3,351 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టగా 16,755 మంది సిబ్బంది పాల్గొన్నారని పేర్కొంది.
కాగా, ఏపీలో కొవిన్ యాప్ లో సాంకేతిక సమస్యలతో పలు ప్రాంతాల్లో ఆలస్యంగా వ్యాక్సినేషన్ నిర్వహించినట్టు తెలిసింది. సాయంత్రం 6 గంటల వరకు 16,963 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. 332 కేంద్రాల ద్వారా 32,739 మందికి వ్యాక్సిన్ అందించాలనేది తమ లక్ష్యమని, అనుకున్న లక్ష్యాన్ని పూర్తిచేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇవాళ అత్యధికంగా గుంటూరు జిల్లాలో 2,274 మందికి వ్యాక్సినేషన్ చేయగా, అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 436 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.