Kamal Morarka: కేంద్ర మాజీ మంత్రి, బీసీసీఐ మాజీ ఉపాధ్యక్షుడు కమల్ మొరార్కా కన్నుమూత
- అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన మొరార్కా
- ముంబయిలో ఈ సాయంత్రం మృతి
- చంద్రశేఖర్ క్యాబినెట్ లో కేంద్రమంత్రిగా పనిచేసిన మొరార్కా
- భారత క్రికెట్ తోనూ అనుబంధం
కేంద్ర మాజీ మంత్రి కమల్ మొరార్కా కన్నుమూశారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. అనారోగ్యంతో బాధపడుతూ ఆయన ముంబయిలో ఈ సాయంత్రం తుదిశ్వాస విడిచారు. మొరార్కా 1990-91లో చంద్రశేఖర్ కేబినెట్ లో కేంద్రమంత్రిగా వ్యవహరించారు. 1988 నుంచి 94 వరకు జనతాదళ్ (సెక్యులర్) పార్టీ తరఫున రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు.
సంప్రదాయ మార్వాడీ కుటుంబంలో 1946 జూన్ 18న జన్మించిన మొరార్కా ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. మొరార్కా ఆర్గానిక్ కంపెనీకి చైర్మన్ గానూ వ్యవహరించారు. ఆయనకు క్రీడలంటే ఎంతో ఆసక్తి. ముఖ్యంగా క్రికెట్ పై అనురక్తితో బీసీసీఐ ఉపాధ్యక్షుడిగానూ పనిచేశారు. రాజస్థాన్ క్రికెట్ సంఘం ఉపాధ్యక్షుడిగానూ వ్యవహరించారు. మొరార్కా సమాజ్ వాదీ జనతా పార్టీ (రాష్ట్రీయ)కి 2012 నుంచి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.