Websites: దేశంలో ఓటీటీలు, వెబ్ సైట్ల నియంత్రణ కోసం ప్రత్యేక వ్యవస్థ
- ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల నియంత్రణకు వ్యవస్థలు
- వెబ్ సైట్లు, ఓటీటీలకు ఎలాంటి చట్టం లేని వైనం
- ఫిర్యాదులు వస్తున్నాయంటున్న కేంద్రం
- నూతనంగా చట్టం తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు
భారత్ లో ప్రింట్ మీడియాపై నియంత్రణ కోసం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉండగా, ఎలక్ట్రానిక్ మీడియాపై అదుపు కోసం కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ రెగ్యులేషన్ చట్టం ఉంది. అయితే, వెబ్ మీడియా, ఓటీటీ కంటెంట్ ను నియంత్రించేందుకు ఎలాంటి చట్టం, వ్యవస్థ లేవు. ఈ నేపథ్యంలో డిజిటల్ మీడియాను కట్టడి చేసేందుకు ఓ సెల్ఫ్ రెగ్యులేటరీ వ్యవస్థను, సంబంధిత చట్టాన్ని తీసుకువచ్చేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది.
దేశంలో 100కి పైగా న్యూస్ కంటెంట్ వెబ్ సైట్లు, 40కి పైగా ఓటీటీ వేదికలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వీటిపై వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి ఓ చట్టం ఉండాలని కేంద్రం తలపోస్తోంది. న్యూస్ వెబ్ సైట్ల నుంచి ఫేక్ న్యూస్ వస్తున్నాయని, ఓటీటీ వేదికల నుంచి కూడా భాషా సంబంధిత ఫిర్యాదులు, వీడియో కంటెంట్ పై అభ్యంతరాలు వస్తున్నాయని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అధికారులు అంటున్నారు. ఈ ఫిర్యాదులపై స్పందించేందుకు ఓ వ్యవస్థ అవసరమని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని, నూతనంగా తీసుకువచ్చే చట్టంలో డిజిటల్ మీడియా స్వేచ్ఛకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు.