Shoaib Aktar: గాయాలతో కీలక ఆటగాళ్లు దూరమైనా టీమిండియా పోరాడుతున్న తీరు భేష్: షోయబ్ అక్తర్
- టీమిండియాలో సగం మంది ఆటగాళ్లకు గాయాలు
- జట్టుకు దూరమైన సీనియర్లు
- రాణిస్తున్న కొత్త కుర్రాళ్లు
- వారి స్ఫూర్తి అభినందనీయమన్న అక్తర్
- టెస్టు సిరీస్ గెలిస్తే చరిత్ర సృష్టిస్తారని వెల్లడి
ఆస్ట్రేలియా పర్యటనలో ప్రధాన ఆటగాళ్లు గాయాల పాలై జట్టుకు దూరమైనప్పటికీ టీమిండియా పోరాడుతున్న తీరును పాకిస్థాన్ పేస్ దిగ్గజం షోయబ్ అక్తర్ అభినందించాడు. టెస్టు సిరీస్ లో పూర్తిస్థాయి జట్టుతో బరిలో దిగిన ఆసీస్ ను కొత్త ఆటగాళ్లతో కూడిన భారత్ అత్యంత పోరాటపటిమతో ఎదుర్కొంటోందని కొనియాడాడు. భారత క్రికెట్లో ఉన్న సుగుణం ఇదేనని ప్రశంసించాడు.
"ఎంతోమంది ఆటగాళ్లు జట్టుకు దూరమైనా, సుందర్, నటరాజన్, శార్దూల్ ఠాకూర్ వంటి చిన్నవాళ్లతో టీమిండియా పోరు కొనసాగిస్తోంది. ఈ పసి ఆటగాళ్లు తాము ఆస్ట్రేలియాలో టెస్టు క్రికెట్ ఆడతామని కలలో కూడా అనుకుని ఉండరు. కానీ ఇది వాస్తవరూపం దాల్చింది. ఒకవేళ ఈ సిరీస్ లో టీమిండియా తన ద్వితీయ శ్రేణి ఆటగాళ్లతో ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్ లో విజయం సాధిస్తే అది భారత క్రికెట్ చరిత్రలోనే పెద్ద విజయం అవుతుంది" అని అక్తర్ అభిప్రాయపడ్డాడు.
"జస్ప్రీత్ బుమ్రా లేడు, ప్రధాన బ్యాట్స్ మెన్ లేరు. చివరి టెస్టుకు వచ్చేసరికి ప్రధాన జట్టు అంతా వైదొలిగింది. కానీ ఈ కుర్రాళ్లతో కూడిన జట్టు ప్రదర్శిస్తున్న స్ఫూర్తి అమోఘం. పూర్తి స్థాయి పేస్ బలంతో బరిలో దిగిన ఆసీస్ ను నిలువరిస్తున్న తీరు అభినందనీయం. ఆసీస్ టీమ్ తో పోలిస్తే ప్రస్తుతం టీమిండియాలో ఆడుతున్న యువ ఆటగాళ్లు ఏమంత అనుభవజ్ఞులు కాదు. కానీ ఓ జట్టుగా వారి వైఖరి అందరినీ ఆకట్టుకుంటోంది" అని వివరించాడు.
రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ పితృత్వపు సెలవుతో తొలి టెస్టు అనంతరం జట్టు నుంచి తప్పుకోగా, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, కేఎల్ రాహుల్ వంటి ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరమయ్యారు.