Kishan Reddy: ఓడిన కార్పొరేటర్లతో ప్రారంభోత్సవాలా?... ట్రంప్ కు, టీఆర్ఎస్ సర్కారుకు తేడా లేదు: కిషన్ రెడ్డి
- బీజేపీ కార్యవర్గ సమావేశంలో కిషన్ రెడ్డి వ్యాఖ్యలు
- ఇక టీఆర్ఎస్ ఓట్లు అడిగే పరిస్థితి లేదని వెల్లడి
- కేసీఆర్ కు నీతి, నిలకడలేవని విమర్శలు
- ప్రజల్లో మార్పు బీజేపీకే అనుకూలమని ఉద్ఘాటన
కేంద హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి టీఆర్ఎస్ సర్కారుపై ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓట్లు అడిగే పరిస్థితి లేదని అన్నారు. ఎంఐఎంతో పొత్తు లేకపోతే గ్రేటర్ లో టీఆర్ఎస్ కు సింగిల్ డిజిట్టేనని వ్యాఖ్యానించారు. ఎన్నికల తర్వాత వరదసాయం ఇస్తామన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఓడిన కార్పొరేటర్లతో కేటీఆర్ ప్రారంభోత్సవాలు చేయిస్తున్నారని విమర్శించారు. నీతి, నిలకడలేని కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మడంలేదని పేర్కొన్నారు. ట్రంప్ కు, సీఎం కేసీఆర్, కేటీఆర్ కు మధ్య తేడా లేదని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
హైదరాబాదులో జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని సీనియర్ ఐఏఎస్ అధికారుల మాటల ద్వారా అర్థమవుతోందని, మార్పు బీజేపీకే అనుకూలమని తాము భావిస్తున్నామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రానున్న రెండేళ్లు తెలంగాణలో బీజేపీకి అత్యంత కీలక సమయం అని అభిప్రాయపడ్డారు.