Pakistan: ప్రత్యేక దేశం కోరుతూ సింధ్ ప్రావిన్స్ లో భారీ ర్యాలీ... మోదీ ప్లకార్డులతో నినాదాలు!
- పాక్ నుంచి విముక్తి కావాలని డిమాండ్
- సాన్ పట్టణంలో భారీ ర్యాలీ
- మోదీ వంటి నేతలు కల్పించుకోవాలని వినతి
ఎన్నో దశాబ్దాలుగా, తమకు పాకిస్థాన్ నుంచి విముక్తిని కల్పించి, సింధ్ పేరిట ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నసింధ్ ప్రావిన్స్ ప్రజలు, సింధీ నేషనలిజం వ్యవస్థాపకుల్లో ఒకరైన జీఎం సయ్యద్ 117వ జయంతిని పురస్కరించుకుని సాన్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో నరేంద్ర మోదీ పేరిట ప్లకార్డులు కనిపించడం గమనార్హం. మోదీతో పాటు పలువురు ఇతర దేశాల నేతలను ఉద్దేశిస్తూ ప్లకార్డులను ప్రదర్శించిన నిరసనకారులు, వారంతా పాక్ అరాచకాల నుంచి తమను కాపాడాలని నినాదాలు చేశారు.
కాగా, పాక్ పాలకులకు ఇప్పటికే బెలూచిస్థాన్ ప్రజల నుంచి వ్యతిరేకత పెరుగుతుండగా, సింధూ దేశ్ డిమాండ్ కు కూడా అక్కడి ప్రజల నుంచి మద్దతు పెరుగుతోంది. తమను వేధిస్తున్నారని, వివక్షకు గురి చేస్తున్నారని ఇక్కడి వారు ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. సింధూలోయలో శతాబ్దాల క్రితమే నాగరికత వెల్లివిరిసిందన్న సంగతి తెలిసిందే. ఆపై ఈ ప్రాంతాన్ని తొలుత బ్రిటీషర్లు ఆక్రమించారు.
అప్పటి నుంచి సింధ్ ప్రాంత ప్రజలపై వివక్ష మొదలైంది. ప్రత్యేక సింధ్ దేశం కోసం రాజకీయ పార్టీలు కూడా ప్రారంభమై, తమకు అవకాశం వచ్చినప్పుడల్లా, పాక్ పాలకుల దురాగతాలను, మానవ హక్కుల ఉల్లంఘనలను అంతర్జాతీయ వేదికలపై ఎండగడుతూనే ఉన్నాయి. పాకిస్థాన్ నుంచి తమను వేరు చేయాలంటూ 1967లో ఈ ఉద్యమం ప్రారంభం కాగా, ఎప్పటికప్పుడు పాక్ ప్రభుత్వం వారిని అణచివేస్తూనే ఉంది.
ఇప్పటికే ఎంతో మంది జాతీయవాద నేతలు, విద్యార్థులు, సింధ్ ప్రాంత రాజకీయ పార్టీల కార్యకర్తలు కనిపించకుండా పోయారు. వీరందరినీ పాక్ సైన్యమే అపహరించిందని, ఆపై వారిని చిత్ర హింసలు పెట్టి చంపేశారని ఈ ప్రాంత నాయకులు ఆరోపిస్తున్నారు.