Russia: విమానంలో రష్యా చేరుకోగానే అలెక్సీ నావల్నీ అరెస్టు.. కలకలం
- రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్నీ
- గతంలో ఆయనపై విష ప్రయోగం
- జర్మనీలో చికిత్స తీసుకుని కొన్ని నెలల తర్వాత రష్యాకు
- అలెక్సీ అరెస్టును ఖండిస్తోన్న ప్రపంచ దేశాల నేతలు
రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్నీని పోలీసులు అరెస్టు చేశారు. జర్మనీ రాజధాని బెర్లిన్ నుంచి మాస్కోలోని షెరెమెటివో విమానాశ్రయంలో ఆయన అడుగు పెట్టగానే ఈ ఘటన చోటు చేసుకుంది. సొంత దేశంలో కొన్ని నెలలుగా రష్యా రాజకీయాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన అలెక్సీని అరెస్టు చేయడం పట్ల ప్రపంచ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
అలెక్సీ నావల్నీ అరెస్టు వెనుక పెద్ద కథే ఉంది. యాంటీ కరప్షన్ ఫౌండేషన్‌ను స్థాపించి పోరాడుతోన్న అలెక్సీ నావల్నీపై రష్యా ప్రభుత్వం నిధుల దుర్వినియోగం ఆరోపణలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన కొన్ని నెలల క్రితం తీవ్ర అస్వస్థతకు గురి కావడం కలకలం రేపింది. ఆయన అప్పట్లో విమానంలో ప్రయాణిస్తుండగా అనారోగ్యానికి గురయ్యారు.
దీంతో విమానాన్ని అత్యవసరంగా దించి ఆసుపత్రికి తరలించారు. విమానంలో ఆయనకు ఇచ్చిన తేనీరులో ఏదో కలిపి ఉంటారని అప్పట్లో ఆయన మద్దతుదారులు అనుమానాలు వ్యక్తంచేశారు. అనంతరం ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. ఆయన విష ప్రయోగానికి గురైనట్లుగా తీవ్ర ఆరోపణలు రావడంతో కలకలం రేపింది.
దీంతో ఆయనను చికిత్స కోసం జర్మనీకి తరలించగా కొన్ని నెలల పాటు ఆయన అక్కడే ఉన్నారు. అయితే, ఆయన శరీరంలో విషపు ఆనవాళ్లు కనిపించలేదని వైద్యులు అప్పట్లో ప్రకటన చేశారు. బెర్లిన్ నగరంలో ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని ఆయన పూర్తిగా కోలుకున్నప్పటికీ రష్యాకు రాలేదు.
ఆసుపత్రిలో కోలుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నరాలను ప్రభావితం చేసే విష ప్రయోగం తనపై జరిగిందని చెప్పారు. రష్యాకు తిరిగి వెళ్లనున్నట్లు ఇటీవల ప్రకటించారు. అయితే, ఆయన రష్యాకు వస్తే అరెస్టు చేస్తామని ఇటీవలే రష్యా ప్రభుత్వం ప్రకటించింది. అయినప్పటికీ ఆయన రష్యా వచ్చారు. దీంతో ఆయనను అరెస్టు చేయడం కలకలం రేపుతోంది
రష్యా అధ్యక్షుడు పుతిన్ చర్యలను తీవ్రంగా వ్యతిరేకించే అలెక్సీ నావల్నీపై ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కుట్రలకు పాల్పడుతోందని ఆరోపణలు వచ్చాయి. కాగా, ఆయన రష్యాకు వస్తున్నారని తెలుసుకున్న ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున ఎయిర్ పోస్టు పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు. ప్రభుత్వం ఆంక్షలు పెట్టినప్పటికీ వందలాది మంది తరలివచ్చారు. ఆయన అరెస్టును నిరసిస్తూ ఆందోళనలు చేస్తున్నారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.