Brisbane Test: బ్రిస్బేన్ టెస్టులో నాలుగో రోజు ఆటకు ముగింపు పలికిన వరుణుడు!
- భారత్ విజయలక్ష్యం 328 పరుగులు
- రెండో ఇన్నింగ్స్ లో 1.5 ఓవర్లలో 4/0
- రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ 294 ఆలౌట్
- సిరాజ్ కు 5 వికెట్లు
బ్రిస్బేన్ లో టీమిండియా, ఆసీస్ మధ్య జరుగుతున్న చివరి టెస్టులో నాలుగో రోజు ఆట ముగిసింది. 328 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 1.5 ఓవర్లలో 4 పరుగులు చేసింది. ఈ దశలో వరుణుడు మరోసారి పలకరించడంతో ఆట కొనసాగించడం వీలుపడలేదు. దాంతో ఇవాళ్టి ఆట ముగిసిందని అంపైర్లు ప్రకటించారు. ఈ మ్యాచ్ లో భారత్ గెలవాలంటే ఇంకా 324 పరుగులు చేయాలి. ఆటకు మరో రోజు మిగిలివున్నందున చివరిరోజు మరింత ఆసక్తికరంగా మారింది. చేతిలో 10 వికెట్లు ఉన్న టీమిండియా గెలుపు కోసం పోరాడుతుందో, లేక డ్రా చేసుకోవడానికి మొగ్గు చూపుతుందో చూడాలి.
అంతకుముందు, ఓవర్ నైట్ స్కోరు 21/0తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆతిథ్య ఆస్ట్రేలియా 294 పరుగులకు ఆలౌటైంది. మాజీ కెప్టెన్ స్మిత్ 55, వార్నర్ 48 పరుగులతో రాణించారు. చివర్లో కామెరాన్ గ్రీన్ (37), కెప్టెన్ టిమ్ పైన్ (27), పాట్ కమ్మిన్స్ (28 నాటౌట్) తలో చేయి వేయడంతో ఆసీస్ ఫర్వాలేదనిపించే స్కోరు నమోదు చేయగలిగింది.
టీమిండియా బౌలర్లలో మహ్మద్ సిరాజ్ ఐదు వికెట్లు తీయడం హైలైట్ అని చెప్పాలి. కెరీర్ లో మూడో టెస్టు ఆడుతున్న ఈ హైదరాబాదీ పేసర్ అద్భుతమైన ప్రతిభ చూపి కంగారూలను కట్టడి చేశాడు. ఈ మ్యాచ్ లో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 369 పరుగులు చేయగా, భారత్ 336 పరుగులతో బదులిచ్చిన సంగతి తెలిసిందే.