Congress: మహిళా అధికారిపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు.. వీడియో వైరల్
- వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన ఎమ్మెల్యే
- అధికారిణి బయటకు రాని వైనం
- కాంగ్రెస్ ఎమ్మెల్యే హర్ష్ విజయ్ గెహ్లాట్ ఆగ్రహం
అందరి ముందూ ఓ మహిళపై ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియో వైరల్ అవుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు ఆందోళన చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే హర్ష్ విజయ్ గెహ్లాట్ తాజాగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే నేతృత్వంలో రైతులు వినతిపత్రం సమర్పించడానికి ఎస్‌డీఎం కార్యాలయానికి వెళ్లారు.
అయితే, వినతి పత్రాన్ని స్వీకరించేందుకు స్థానిక సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డీఎం) కామిని ఠాకూర్ బయటకు రావడంలో ఆలస్యం చేశారు. దీంతో ఎమ్మెల్యే గెహ్లాట్ మండిపడ్డారు. తాను ఎమ్మెల్యేనని, తన మాటను ఆమె అర్థం చేసుకోవడంలేదని, ఆమె మహిళా అధికారి అయిపోయారని, ఆమె స్థానంలో మరో పురుష అధికారి వుండివుంటే కనుక గల్లా పట్టుకొని ఒక్కటిచ్చేవాడినంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.