China: అరుణాచల్ ప్రదేశ్ లో ఓ గ్రామాన్ని నిర్మించిన చైనా.... మోదీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఒవైసీ
- చైనా చొరబాటుపై ఉపగ్రహ చిత్రాలు
- 101 గృహాలతో గ్రామం నిర్మాణం
- మోదీ అత్యంత బలహీన ప్రధాని అంటూ ఒవైసీ వ్యాఖ్యలు
- మౌనంగా ఉంటున్నారని ఆగ్రహం
- జిన్ పింగ్ ఆవాస్ యోజన అంటూ ఎద్దేవా
అరుణాచల్ ప్రదేశ్ లో చైనా ఏకంగా ఓ గ్రామాన్నే నిర్మించిందంటూ ఉపగ్రహ చిత్రాలు చెబుతున్నాయి. ఆ గ్రామంలో 101 గృహాలు ఉన్నట్టు గుర్తించారు. సరిహద్దులకు 4.5 కిలోమీటర్ల దూరంలోనే ఈ గ్రామాన్ని చైనా నిర్మించిందని నిపుణులు విశ్లేషించారు. గతేడాది నవంబరు 20 నాటి ఉపగ్రహ చిత్రాలను పరిశీలించిన నిపుణులు అరుణాచల్ ప్రదేశ్ లోని సుబాన్సిరి జిల్లాలోని త్సారీ చు నదీ తీరం వెంబడి ఈ నిర్మాణాలు చేపట్టినట్టు గుర్తించారు. కాగా ఈ ప్రాంతంపై భారత్, చైనా మధ్య సుదీర్ఘకాలంగా వివాదాలు ఉన్నాయి.
అయితే, ఇప్పుడా ప్రాంతంలో చైనా గ్రామం నిర్మించడం పట్ల ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ట్విట్టర్ లో ఘాటుగా స్పందించారు. నరేంద్ర మోదీ ఓ బలహీన, అసమర్థ ప్రధాని అంటూ మండిపడ్డారు. "చైనా మన భూభాగంలో గ్రామాలు నిర్మిస్తోంది. ఇదేమైనా షీ జిన్ పింగ్ కు ప్రత్యేక ఆవాస్ యోజనా ఏంటి?" అంటూ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ప్రధానులుగా పనిచేసిన వారందరిలోకి నరేంద్ర మోదీ అత్యంత దుర్భలుడైన ప్రధాని అని విమర్శించారు. సిక్కిమ్ లోని నాకు లా, లడఖ్, అరుణాచల్ ప్రదేశ్ లో చైనా చొచ్చుకువస్తుంటే మౌనంగా ఉంటున్నారని ఆరోపించారు.
"మన భూభాగం చైనా అధీనంలో ఉందని చెప్పేందుకు నిరాకరిస్తున్నారు. మా భాభూగం మాకిచ్చేయండంటూ చైనాను ఎలాంటి డిమాండ్లు చేయడంలేదు. చైనా నుంచి మన భూభాగాలను విడిపించేందుకు ఎలాంటి సైనిక చర్యలు తీసుకోవడంలేదు. చైనా చేతిలో మన వీరసైనికులు మరణించినందుకు ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకోవడంలేదు" అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు.