Kamala Harris: విదేశీ, స్వదేశీ శత్రువుల నుంచి అమెరికా రాజ్యాంగాన్ని కాపాడతా: కమలా హారిస్
- కమలా దేవి హారిస్ అను నేను.. అంటూ ప్రమాణ స్వీకారం
- భగవంతుడా, నాకు సహకరించు అని వేడుకోలు
- నల్లజాతి డిజైనర్లు రూపొందించిన దుస్తుల్లో మెరిసిన కమల
- నల్ల జాతి మహిళల ఫొటోలతో తొలి ట్వీట్
అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన భారత సంతతికి చెందిన కమలా హారిస్ అనంతరం మాట్లాడుతూ.. రాజ్యాంగంపై నిజమైన నమ్మకం, విధేయత కలిగి ఉంటానని అన్నారు. తన విధిని స్వేచ్ఛగా స్వీకరిస్తానని, విదేశీ, స్వదేశీ శత్రువుల నుంచి అమెరికా రాజ్యాంగాన్ని కాపాడతానని అన్నారు. తాను చేపట్టబోయే పదవిని బాధ్యతతో నిర్వర్తిస్తానని ప్రమాణం చేస్తున్నట్టు చెప్పారు. ‘భగవంతుడా, నాకు సహకరించు’ అని వేడుకున్నారు.
అనంతరం అధికారిక ట్విట్టర్ ద్వారా తొలి ట్వీట్ చేశారు. తానీరోజు ఈ పదవిలో ఉన్నానంటే అందుకు ఇంత వరకు ముందడుగు వేసిన మహిళలే కారణమని అన్నారు. తాను ఎల్లప్పుడూ ప్రజలకు సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన ట్వీట్‌కు తన తల్లి శ్యామల, పలువురు నల్లజాతి మహిళల ఫొటోలను జత చేశారు. నల్లజాతి డిజైనర్లు క్రిస్టఫర్ జాన్ రోగర్స్, సెర్గియో హడ్సన్‌లు రూపొందించిన ఊదారంగు దుస్తులు ధరించి ‘కమలాదేవి హారిస్ అను నేను..’ అంటూ ప్రమాణస్వీకారం చేశారు.