Team India: రచ్చ గెలిచిన టీమిండియా ఆటగాళ్లకు స్వదేశంలో ఘనస్వాగతం
- ఆసీస్ పై టెస్టు సిరీస్ లో విజయం సాధించిన భారత్
- కుర్రాళ్లయినా పోరాట పటిమతో ఆకట్టుకున్న వైనం
- స్వదేశం చేరుకున్న పలువురు ఆటగాళ్లు
- దుబాయ్ లోనే ఉన్న అశ్విన్, సుందర్, బౌలింగ్ కోచ్ అరుణ్
ఆసీస్ ను వారి సొంతగడ్డపైనే టెస్టు సిరీస్ లో ఓడించి భారత కీర్తిపతాకను రెపరెపలాడించిన టీమిండియా ఆటగాళ్లు స్వదేశానికి చేరుకున్నారు. నాలుగు టెస్టుల సిరీస్ లో కీలక ఆటగాళ్లు లేకపోయినా కుర్రాళ్లు అసమాన పోరాట పటిమ చూపుతూ 2-1తో విజయం సాధించడం భారత క్రికెట్ అభిమానులను ఆనందోత్సాహాల్లో ముంచెత్తుతోంది. ఈ క్రమంలో టెస్టు సిరీస్ ముగించుకుని భారత గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా ఆటగాళ్లకు ఆయా ఎయిర్ పోర్టుల్లో ఘనస్వాగతం లభించింది.
అజింక్యా రహానే, రోహిత్ శర్మ, కోచ్ రవిశాస్త్రి, పృథ్వీషా, శార్దూల్ ఠాకూర్ ముంబయి చేరుకోగా, వందలమంది అభిమానులు ఎయిర్ పోర్టు వద్ద వారికి స్వాగతం పలికారు. అటు, హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ కు ఇవాళ ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టులో అభిమానుల నుంచి హార్దికస్వాగతం లభించింది. సిరీస్ విజయంలో కీలకపాత్ర పోషించిన రిషబ్ పంత్ ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకోగా, అభిమానులు హర్షధ్వానాలతో స్వాగతించారు.
కాగా, అశ్విన్, వాషింగ్టన్ సుందర్, టీమిండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నారు. వీరు రేపు ఉదయం చెన్నై చేరుకుంటారు. ఇక, నెట్ బౌలర్ గా టీమిండియా వెంట వెళ్లి మూడు ఫార్మాట్లలోనూ ఆడిన తంగరసు నటరాజన్ బెంగళూరు ఎయిర్ పోర్టు నుంచి తన స్వస్థలానికి పయనమయ్యాడు.
ఇక, ఆసీస్ తో సిరీస్ ముగిసిన నేపథ్యంలో ఇప్పుడందరి దృష్టి ఇంగ్లాండ్ తో సొంతగడ్డపై జరిగే నాలుగు టెస్టుల సిరీస్ పై పడింది. ఫిబ్రవరి 5 నుంచి చెన్నైలో భారత్, ఇంగ్లాండ్ తొలి టెస్టు జరగనుంది. ఆస్ట్రేలియా నుంచి స్వదేశానికి చేరుకున్న భారత ఆటగాళ్లు ఇంగ్లాండ్ తో సిరీస్ కోసం జనవరి 29న శిక్షణ శిబిరంలో కలవనున్నారు.