Mohammed Siraj: హైదరాబాద్ చేరుకున్న వెంటనే తండ్రి సమాధిని దర్శించి భావోద్వేగాలకు గురైన టీమిండియా పేసర్ సిరాజ్
- ఆస్ట్రేలియా పర్యటనలో రాణించిన సిరాజ్
- పర్యటన ఆరంభంలో తండ్రిని కోల్పోయిన వైనం
- అనారోగ్యంతో సిరాజ్ తండ్రి గౌస్ కన్నుమూత
- విషాదాన్ని భరిస్తూ మైదానంలో సత్తా చాటిన హైదరాబాదీ పేసర్
ఆసీస్ గడ్డపై టీమిండియా సాధించిన చిరస్మరణీయ టెస్టు సిరీస్ విజయంలో హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ పాత్ర ఎనలేనిది. ఆస్ట్రేలియా పర్యటన ఆరంభంలోనే సిరాజ్ తండ్రిని కోల్పోయాడు. తన కొడుకు జాతీయ జట్టుకు ఆడాలన్నది సిరాజ్ తండ్రి మహ్మద్ గౌస్ కల. అయితే, కొన్నిరోజుల కిందట గౌస్ అనారోగ్యంతో మరణించారు. క్వారంటైన్ నిబంధనలు ఓవైపు, జాతీయ జట్టుకు ఆడాలన్న తపన మరోవైపు... సిరాజ్ ను ఆస్ట్రేలియా పర్యటనలో కొనసాగేలా చేశాయి. తండ్రి మరణాన్ని పంటి బిగువున భరించిన సిరాజ్ కంగారూలను హడలెత్తించాడు.
తాజాగా సిరీస్ ముగియడంతో టీమిండియా ఆటగాళ్లు స్వదేశానికి చేరుకున్నారు. హైదరాబాద్ చేరుకున్న వెంటనే సిరాజ్ తండ్రి సమాధి వద్దకు వెళ్లి తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యాడు. తనను జాతీయ క్రికెటర్ గా చూడాలనుకున్న తండ్రికి ఘనంగా నివాళులు అర్పించాడు. తండ్రి సమాధిపై పువ్వులు ఉంచి, దైవ ప్రార్ధనలు చేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో ఆకట్టుకుంటున్నాయి.