Natarajan: టీమిండియా కొత్త బౌలర్ నటరాజన్ ను రథంపై ఊరేగించిన గ్రామస్థులు
- ఆస్ట్రేలియా పర్యటనలో రాణించిన నటరాజన్
- స్వగ్రామంలో అపూర్వ స్వాగతం
- నీరాజనాలు పలికిన గ్రామస్థులు, క్రికెట్ అభిమానులు
- నటరాజన్ ఘనతల పట్ల గర్వించిన వైనం
గతంలో ఎన్నడూ లేనంతగా టీమిండియాలోకి కొత్తవాళ్లు వచ్చారు. రావడమే కాదు.. తమ ప్రతిభను చాటుకుంటూ ఆస్ట్రేలియా గడ్డపై అత్యంత మధురమైన విజయాన్ని అందించారు. తమిళనాడుకు చెందిన టి.నటరాజన్ కూడా వారిలో వున్నాడు. ఐపీఎల్ లో సన్ రైజర్స్ తరఫున అమోఘంగా రాణించి టీమిండియాలో స్థానం సంపాదించిన ఈ లెఫ్టార్మ్ పేసర్ ఆస్ట్రేలియా పర్యటనలో అందివచ్చిన అవకాశాలను అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. హేమాహేమీలున్న ఆసీస్ బ్యాటింగ్ లైనప్ పై ఏమాత్రం తడబాటు లేకుండా బౌలింగ్ చేసి కీలక దశలో వికెట్లు తీశాడు.
ఆసీస్ తో టెస్టు సిరీస్ ను 2-1తో నెగ్గడంలో తనవంతు పాత్రను సమర్థంగా పోషించిన ఈ తమిళ కుర్రాడికి స్వగ్రామంలో అపూర్వ స్వాగతం లభించింది. ఆస్ట్రేలియా నుంచి బెంగళూరు వచ్చిన నటరాజన్ అక్కడి నుంచి తన సొంతూరు చేరుకున్నాడు. నటరాజన్ స్వస్థలం తమిళనాడులోని సేలం జిల్లా చిన్నప్పంపట్టి గ్రామం. తమ ఊరివాడు భారత జట్టుకు ఎంపిక కావడమే కాకుండా, విశేషంగా రాణించడంతో చిన్నప్పంపట్టి గ్రామస్థులు గర్విస్తున్నారు.
ఈ క్రమంలో ఆస్ట్రేలియా పర్యటన నుంచి వచ్చిన నటరాజన్ ను గుర్రాలను పూన్చిన రథంలో ఊరేగించారు. నటరాజన్ నివాసం వరకు ఈ ఊరేగింపు సాగింది. భారీ సంఖ్యలో క్రికెట్ అభిమానులు తరలిరావడంతో చిన్నప్పంపట్టిలో కోలాహలం మిన్నంటింది.