United Nations: 'సీరం' అగ్నిప్రమాదంపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుగుతుందని ఆశిస్తున్నాం: ఐక్యరాజ్యసమితి
- పూణేలోని సీరం కేంద్రంలో నిన్న అగ్నిప్రమాదం
- ఐదుగురి మృతి
- తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఐరాస సెక్రెటరీ జనరల్
- మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
పూణేలోని సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రం వద్ద నిన్న జరిగిన భారీ అగ్నిప్రమాదంపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రాస్ స్పందించారు. ఈ అగ్నిప్రమాదంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుగుతుందని ఆశిస్తున్నామని తెలిపారు. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం విచారకరమని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని వివరించారు. గుటెర్రాస్ తరఫున ఆయన అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ ఓ ప్రకటన చేశారు.
పూణేలోని సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో నూతనంగా నిర్మిస్తున్న భవనం వద్ద గురువారం మధ్యాహ్నం భారీగా మంటలు చెలరేగాయి. మంటలను అదుపుచేసిన అగ్నిమాపక బృందాలు బాగా కాలిపోయిన స్థితిలో ఉన్న ఐదు మృతదేహాలను వెలికి తీశాయి. పూణేలోని సీరం కేంద్రంలో ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ ను భారీగా ఉత్పత్తి చేస్తున్నారు. ప్రపంచదేశాల అవసరాల నిమిత్తం కొవిషీల్డ్ డోసుల అదనపు ఉత్పత్తి కోసం సీరం యాజమాన్యం నూతన భవనాలు నిర్మిస్తోంది. ఈ భవనాల్లోనే అగ్నికీలలు చెలరేగాయి.