Nimmagadda Ramesh Kumar: ఏపీ 'స్థానిక' ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. మీడియా సమావేశంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ కీలక వ్యాఖ్యలు
- విజయనగరం, ప్రకాశం మినహా మిగతా జిల్లాల్లో ఎన్నికలు
- నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు
- ముందుగా నిర్ణయించిన ప్రకారమే ప్రక్రియ
- ఏపీ ప్రభుత్వం నుంచి మిశ్రమ అనుభవాలు
- సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తప్పకుండా పాటిస్తాం
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల తొలిదశ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రోజు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు తెలిపారు. విజయనగరం, ప్రకాశం జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని వివరించారు. ముందుగా నిర్ణయించిన ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు.
ఈ రోజు జారీ చేసిన నోటిఫికేషన్ తో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 25న అభ్యర్థులనుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఈ నెల 27 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 28న నామినేషన్లు పరిశీలిస్తారు. అనంతరం 29న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన ఉంటుంది. 30న ఈ అభ్యంతరాలపై తుది నిర్ణయం తీసుకుంటారు. అనంతరం, 31 మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. దీంతో పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా విడుదల అవుతుంది. ఫిబ్రవరి 5న పోలింగ్ నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా నిమ్మగడ్డ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము పూర్తిగా నిబంధనల ప్రకారమే ముందుకు వెళ్తున్నామని తెలిపారు. రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ మానసపుత్రికే ఎన్నికల సంఘం అని ఆయన అన్నారు. దాని ప్రకారమే ఎన్నికలు సకాలంలో నిర్వహించడమనేది ఎన్నికల కమిషన్ విధి అని చెప్పారు.
అందుకే తాము ఎన్నికల ప్రక్రియను ప్రారంభించి ముందుకు వెళ్తున్నామని తెలిపారు. అయితే, కొందరు ప్రభుత్వ అధికారులు ఎన్నికల ప్రక్రియను సమర్థంగా కొనసాగించడంలో విఫలమయ్యారని తెలిపారు. ఎన్నికల నిర్వహణ విషయంపై సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా తప్పకుండా పాటిస్తామని స్పష్టం చేశారు.
ఎన్నికల నిర్వహణలో ఏపీ ప్రభుత్వం నుంచి మిశ్రమ అనుభవాలు ఉన్నాయని చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో సమావేశంలో పాల్గొనాలని సీఎస్, పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి హాజరు కావాలని కోరామని తెలిపారు. అయితే, వారు అందుకు హాజరు కాలేదని తెలిపారు. సరైన సమయంలో సరైన రీతిలో చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఏదేమైనా సరైన సమయానికి ఎన్నికలు జరుపుతామని స్పష్టం చేశారు.
ఏకగ్రీవ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు. ఐజీ స్థాయి అధికారితో ఏకగ్రీవాలపై దృష్టి పెడతామని స్పష్టం చేశారు. ప్రభుత్వ విధులు, నిధులు, అధికారాలు వంటి అంశాలన్నీ ఎన్నికల నిర్వహణ వల్లే సాధ్యమవుతాయని ఆయన చెప్పారు.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో గవర్నర్ నుంచి తమకు పూర్తి మద్దతు వస్తుందని ఆశిస్తున్నట్లు నిమ్మగడ్డ రమేశ్ తెలిపారు. ప్రభుత్వ ఉదాసీనత విషయాన్ని తాను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. ఎన్నికల వల్ల స్థానిక నాయకత్వం బలపడుతుందని ఆయన చెప్పారు.