Ashok Babu: ఉద్యోగ సంఘాల నేతల భాష దారుణంగా ఉంది... ప్రభుత్వాన్ని మించి మాట్లాడుతున్నారు: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు
- పంచాయతీ ఎన్నికలపై ఉద్యోగ సంఘాల వ్యతిరేకత
- బాయ్ కాట్ చేస్తామంటూ హెచ్చరికలు
- చంపడాలు, చావడాలు ఎందుకన్న అశోక్ బాబు
- ఉద్యోగ సంఘాల స్థాయిని దిగజార్చుతున్నారని విమర్శలు
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల అంశంపై ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుతున్న భాష దారుణంగా ఉందని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. వారు ప్రభుత్వాన్ని మించి మాట్లాడుతున్నారని విమర్శించారు. తాము చచ్చిపోయే పరిస్థితి వస్తే చంపడానికి కూడా వెనుకాడబోమని ఓ ఉద్యోగ సంఘం నేత అంటున్నాడని, ఈ వ్యాఖ్యలకు అర్థం ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల విధులు నిర్వర్తించండి అంటే చంపడాలు, చావడాలు అంటూ ఇలాంటి భాష ఎందుకు ఉపయోగిస్తున్నారో ఆ నాయకుడు చెప్పాలని నిలదీశారు.
"రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుని ఎన్నికలు నిర్వహించబోమని చెప్పినప్పుడు... మీరు చెబితే ఎన్నికల విధులు నిర్వర్తిస్తాం, మీరు వద్దంటే నిర్వర్తించం అని ఉద్యోగ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాలి. కానీ మీరు బాయ్ కాట్ చేస్తామంటున్నారు.. అసలు మీకేమైనా ఆలోచన ఉందా? ఎప్పుడు బాయ్ కాట్ చేస్తారూ... కలెక్టర్ ఎన్నికల విధులకు ఆదేశించినప్పుడు బాయ్ కాట్ చేయాలి. ఇవాళ కలెక్టర్లు బాయ్ కాట్ చేశారు, సీఎస్ బాయ్ కాట్ చేశారు... అది ప్రభుత్వం చూసుకుంటుంది.
మీరు ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి మీ పాత్ర ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే... కలెక్టర్ గానీ, రిటర్నింగ్ అధికారి గానీ ఎలక్షన్ డ్యూటీ ఇచ్చినప్పటి నుంచి మీ పాత్ర ప్రారంభం అవుతుంది. అప్పుడు బాయ్ కాట్ చేస్తే మీ సామర్థ్యం ఏంటి, మీ ఐక్యత ఏంటనేది తేలుతుంది.
ప్రభుత్వమే ఎన్నికలకు వెళ్లబోమని చెబుతుంటే మీరెందుకు మాట్లాడుతున్నారు? మీ స్థాయి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మించింది అనుకుంటున్నారా? లేకపోతే వాళ్లకంటే మీకే ఎక్కువ బాధ్యత ఉందనుకుంటున్నారా? ఇలాంటి వ్యాఖ్యలతో ఉద్యోగ సంఘాల స్థాయిని, వాటి ఏర్పాటు వెనకున్న ఉద్దేశాలను దిగజార్చుతున్నారు" అంటూ అశోక్ బాబు విమర్శించారు.