Lalu Prasad Yadav: లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మరింత విషమం!

Lalu Health Very Criticle

  • దాణా స్కామ్ లో ప్రస్తుతం జైలు శిక్ష
  • ఆరోగ్యం విషమించడంతో ఢిల్లీకి తరలింపు
  • 20 శాతమే పనిచేస్తున్న కిడ్నీలు
  • ఆందోళనలో ఆర్జేడీ

రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ అధినేత, దాణా స్కామ్ లో ప్రస్తుతం జైలు శిక్షను అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్ పరిస్థితి మరింత విషమమైందని న్యూఢిల్లీ ఎయిమ్స్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బీహార్ లో ఆయన పార్టీ కార్యకర్తలు, నాయకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాంచీ ఆసుపత్రిలో ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో, న్యూఢిల్లీకి తరలించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన శరీరంలోని పలు అవయవాల పనితీరు దెబ్బతినడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైద్య వర్గాలు తెలిపాయి.

కిడ్నీ సమస్యలకు తోడు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో ఆయన బాధపడుతున్నారని, ఆయన కిడ్నీలు కేవలం 20 శాతం మాత్రమే పనిచేస్తున్నాయని వైద్య వర్గాల సమాచారం. 2017 డిసెంబర్ లో ఆయనకు 7 సంవత్సరాల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన అత్యధిక కాలం జైల్లోనే గడిపారు. మధ్యలో పెరోల్, అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో బందోబస్తు మధ్య గడిపారు. తాను సీఎంగా ఉన్న కాలంలో పశువులకు దాణా నిమిత్తం జరిపిన కొనుగోళ్లపై అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగాలు నిరూపితమైన సంగతి తెలిసిందే.

రూ. 3.50 కోట్లను ఆయన అక్రమంగా ప్రభుత్వ నిధుల నుంచి విత్ డ్రా చేశారన్న అభియోగాలు రుజువయ్యాయి. ఆయనపై మరికొన్ని కేసులూ నిరూపితం అయ్యాయి. వీటన్నింటిలో విధించబడిన శిక్షను ఆయన ఏకకాలంలో అనుభవిస్తున్నారు. తాజాగా, ఆయన ఆరోగ్యం విషమించడంతో బీహార్ లో పోలీసు బందోబస్తును పెంచారు. కాగా, ఏడేళ్ల పాటు లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారన్న సంగతి విదితమే. ఐదేళ్ల పాటు ఆయన కేంద్ర రైల్వే శాఖా మంత్రిగానూ సేవలందించారు.

  • Loading...

More Telugu News