Yanamala: ఇప్పటికైనా ఎన్నికలకు ప్రభుత్వం సహకరించాలి: యనమల
- ఎలాగైనా ఎన్నికలను అడ్డుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం యత్నించింది
- ఉద్యోగ సంఘాలు వత్తాసు పలకడాన్ని సుప్రీం తీవ్రంగా పరిగణించింది
- ఎన్నికల విధుల్లో ఉద్యోగులంతా పాల్గొనాలి
పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలంటూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించడం పట్ల టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం పట్ల ముఖ్యమంత్రి జగన్ అహంభావపూరితంగా వ్యవహరించారని... దీనికి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని చెప్పారు.
రాజ్యాంగానికి, చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ, ఎలాగైనా స్థానిక ఎన్నికలను అడ్డుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం యత్నించిందని మండిపడ్డారు. ఏదో ఒక సాకుతో ఎన్నికలను ఆపాలని ప్రయత్నించిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి వత్తాసు పలికిన ఉద్యోగ సంఘాల తీరును కూడా సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించిందని అన్నారు. ఇప్పటికైనా ఎన్నికలకు ప్రభుత్వం సహకరించాలని సూచించారు. ఎన్నికల విధుల్లో ఉద్యోగులు పాల్గొనాలని అన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు.