Sajjala Ramakrishna Reddy: సుప్రీం తీర్పును గౌరవిస్తున్నాం.. పంచాయతీ ఎన్నికలకు మేం సిద్ధం: ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల
- పంచాయతీ ఎన్నికలు జరపాలంటూ సుప్రీంకోర్టు తీర్పు
- తీర్పును గౌరవిస్తున్నట్టు సజ్జల వెల్లడి
- ఉద్యోగుల ప్రాణాలే తమకు ముఖ్యమని వెల్లడి
- రేపు ఏదైనా జరిగితే ఎస్ఈసీదే బాధ్యత అని స్పష్టీకరణ
ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నామని, అధికార పక్షంగా తాము పంచాయతీ ఎన్నికలకు సిద్ధమేనని స్పష్టం చేశారు. ఓ రాజకీయ పార్టీగా ఈ స్థానిక ఎన్నికలను వైసీపీ ఆహ్వానిస్తోందని వెల్లడించారు. వ్యాక్సిన్ తీసుకోకుండానే ఉద్యోగులు ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఏదైనా జరిగితే ఎస్ఈసీదే బాధ్యత అని అన్నారు. ఉద్యోగ సంఘాల ఆవేదనను ఎస్ఈసీ అర్థం చేసుకోవడంలేదని తెలిపారు.
ప్రజారోగ్యం కోసమే ఇన్నాళ్లూ ఎన్నికలు వద్దనుకున్నామని, అయితే సుప్రీంకోర్టు తీర్పును అంగీకరిస్తున్నామని చెప్పారు. అయితే, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను మధ్యలోనే నిలిపివేసి పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం వెనుక కుట్ర ఉన్నట్టు అర్థమవుతోందని తెలిపారు. ఒకే సమయంలో వ్యాక్సినేషన్, ఎన్నికలు జరపడం కష్టమేనని సజ్జల అభిప్రాయపడ్డారు. తీర్పు వచ్చిన గంటలోనే ఎస్ఈసీ కేంద్రానికి లేఖ రాయడాన్ని సజ్జల తప్పుబట్టారు. ఎవరో ఒకరిపై బురదజల్లడమే ఆయన పని అని విమర్శించారు. తాజా పరిణామాలపై సీఎస్ తదితర ఉన్నతాధికారులతో చర్చిస్తే బాగుండేదని, అలా కాకుండా కేంద్రానికి లేఖ రాయడం ఏంటని ప్రశ్నించారు.
తమ ప్రభుత్వం చట్టాలు, న్యాయ వ్యవస్థలకు లోబడి పనిచేస్తుందని, రాష్ట్ర ఎన్నికల సంఘంలో ఎవరున్నా గానీ ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని వెల్లడించారు. కానీ, అటువైపు ఓ వ్యక్తి మాత్రం అధికారాలను జన్మహక్కులుగా చూసుకుంటూ వ్యవహరిస్తుండడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని పరోక్షంగా నిమ్మగడ్డపై వ్యాఖ్యలు చేశారు. ఎస్ఈసీ వెనుక ఎవరో ఉండి ఇదంతా నడిపిస్తున్నారని, ఆయన ఇవాళ ఉండి రేపు వెళ్లిపోతారని, కానీ వ్యవస్థలు శాశ్వతం అని సజ్జల అభిప్రాయపడ్డారు.