Ratnaprabha: తిరుపతి జనసేన, బీజేపీ అభ్యర్థినిగా మాజీ ఐఏఎస్ రత్నప్రభ!
- త్వరలో తిరుపతి ఉప ఎన్నికలు
- ప్రకాశం జిల్లాకు చెందిన రత్నప్రభ
- కర్ణాటక సీఎస్ గానూ గతంలో విధులు
తిరుపతి లోక్ సభకు జరగనున్న ఉప ఎన్నికల్లో బీజేపీ, జనసేన తరఫున మాజీ ఐఏఎస్ అధికారిణి, కర్ణాటక చీఫ్ సెక్రెటరీగానూ విధులు నిర్వహించిన రత్నప్రభ పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన ఆమె, పలు ప్రభుత్వ విభాగాల్లో సేవలందించారు. ముఖ్యంగా కర్ణాటకలోని పలు జిల్లాల కలెక్టర్ గానూ, వివిధ శాఖల కార్యదర్శిగాను, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగానూ పనిచేశారు. డిప్యుటేషన్ పై ఆంధ్రప్రదేశ్ లోనూ పనిచేశారు.
రిటైర్ అయిన తరువాత ఆమె వృత్తి నైపుణ్య అథారిటీ చైర్ పర్సన్ గానూ విధులు నిర్వహించారు. ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రత్నప్రభ అయితే, వైసీపీని దీటుగా ఎదుర్కోవచ్చన్న ఆలోచనలో ఇరు పార్టీల నేతలూ ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఆమెను ఒప్పించి, బరిలో దింపాలని రెండు పార్టీలూ భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా, రత్నప్రభ తండ్రి కత్తి చంద్రయ్యతో పాటు భర్త విద్యా సాగర్, సోదరుడు ప్రదీప్ చంద్రలు ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారులుగా పనిచేశారు.