GHMC: జీహెచ్​ఎంసీ కార్పొరేటర్ల ప్రమాణానికి అమావాస్య గండం!

GHMC corporators oath runs into Amavasya hurdle

  • ఫిబ్రవరి 11న చేయబోమంటున్న కొందరు కొత్త కార్పొరేటర్లు
  • ప్రభుత్వ నిర్ణయంపై బీజేపీ కార్పొరేటర్ల మండిపాటు
  • టీఆర్ఎస్ కార్పొరేటర్లూ వ్యతిరేకిస్తున్న వైనం
  • తమకే అభ్యంతరం లేదంటున్న మజ్లిస్ పార్టీ

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కొత్త కార్పొరేటర్లు ప్రమాణం చేసేందుకు సమయం దగ్గరపడుతోంది. ఫిబ్రవరి 11న ప్రమాణ స్వీకారం చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే గెజిట్ కూడా ఇచ్చింది. కానీ, కొందరు కార్పొరేటర్లు ఆ రోజున ప్రమాణం చేయబోమంటున్నారు. ఆ రోజు అమావాస్య కావడమే అందుకు కారణం.

అవును, అధికార టీఆర్ఎస్ పార్టీ, బీజేపీలోని కొందరు కార్పొరేటర్లు అమావాస్య రోజు ప్రమాణ స్వీకారం పెట్టడంపై పెదవి విరిచారు. గత ఏడాది డిసెంబర్ లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 56, బీజేపీ 48, మజ్లిస్ పార్టీ 44 సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే.

వీలు దొరికితే ఆ రోజు ప్రమాణానికి గైర్హాజరు అవుతామని కొందరు నేతలు బాహాటంగానే తేల్చి చెబుతున్నారు. అమావాస్య రోజు తాను ఏ పనిని ప్రారంభించనని రెండు సార్లు కార్పొరేటర్ గా ఎన్నికైన టీఆర్ఎస్ నేత ఒకరు చెప్పారు. వీలైతే పార్టీ పెద్దల నుంచి అనుమతి తీసుకుని ఆ రోజున ప్రమాణం చేయనని చెప్పారు.

ప్రభుత్వ నిర్ణయంపై బీజేపీ కార్పొరేటర్లు మండిపడుతున్నారు. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ చెప్పినట్టు సీఎం కేసీఆర్ వింటున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కావాలనే అమావాస్య రోజు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారంటూ బేగం బజార్ బీజేపీ కార్పొరేటర్ జి.శంకర్ యాదవ్ విమర్శించారు.

వాస్తు దోషాలున్నాయన్న కారణంతో సచివాలయాన్ని కూల్చేసిన ప్రభుత్వం.. తమ సెంటిమెంట్లను మాత్రం ఎందుకు పట్టించుకోవట్లేదని హిమాయత్ నగర్ బీజేపీ కార్పొరేటర్ మహాలక్ష్మీ రమణ్ గౌడ్ ప్రశ్నించారు. ఇప్పటికే దీనిపై కొందరు కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి తమ అభ్యంతరాలను తెలియజేశారు. కాగా, ఫిబ్రవరి 11న ప్రమాణం చేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని మజ్లిస్ కార్పొరేటర్లు చెబుతున్నారు.

పండితులు దీనిపై మరో వాదన వినిపిస్తున్నారు. దేశంలో కొన్ని చోట్ల అమావాస్యను మంచిరోజుగానే భావిస్తారని, మరికొన్ని చోట్ల చెడుదినంగా పరిగణిస్తారని మహేశ్ వర్మ అనే జ్యోతిష్యుడు చెప్పారు. అయితే, ఫిబ్రవరి 11న గ్రహాలన్నీ ఒకే వరుసలోకి వస్తున్నాయని, ఈ టైంలో ప్రమాణ స్వీకారం మంచిది కాదని రాజకీయ నాయకులు భావిస్తారని వివరించారు.

  • Loading...

More Telugu News