Somu Veerraju: ఏపీ సర్కారు ఎలాంటి భేషజాలకు పోకుండా ఎస్ఈసీకి సహకరించాలి: సోము వీర్రాజు
- పంచాయతీ ఎన్నికలకు అనుకూలంగా సుప్రీం తీర్పు
- ఎస్ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలన్న సోము వీర్రాజు
- శాస్త్రీయ పద్ధతుల్లో నామినేషన్ల పర్వం ఉండాలని సూచన
- అభ్యర్థులకు రక్షణ కల్పించాలని డిమాండ్
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పంచాయతీ ఎన్నికల అంశంపై మీడియా సమావేశంలో మాట్లాడారు. పంచాయతీ ఎన్నికలు జరపడానికి అనుకూలంగా ఇచ్చిన తీర్పు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ సహకరించాలని అన్నారు. సర్కారు ఎలాంటి భేషజాలకు పోకుండా ఎన్నికల సంఘానికి తమ తోడ్పాటు అందించాలని, తద్వారా ఎన్నికలను ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగేలా చూడాలని సూచించారు.
ఈ సందర్భంగా ఆయన ఎన్నికల సంఘానికి కూడా పలు విజ్ఞప్తులు చేశారు. గతంలో అనేక నామినేషన్లు ఏకగ్రీవం అయ్యాయని, ఈసారి నామినేషన్ల పర్వాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహించాలని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఆన్ లైన్ నామినేషన్ విధానం ప్రవేశపెట్టాలని అన్నారు. నామినేషన్ వేసిన అభ్యర్థులకు రక్షణ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయించే బాధ్యత ఎన్నికల సంఘానిదేనని సోము వీర్రాజు స్పష్టంచేశారు.