KCR: కేసీఆర్ అవినీతిని ప్రశ్నిస్తున్న బండి సంజయ్.. కేంద్రానికి ఎందుకు ఫిర్యాదు చేయలేదు?: ఉత్తమ్
- ఉత్తమ్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ ముఖ్యనేతల సమావేశం
- బీజేపీ, టీఆర్ఎస్ చీకటి ఒప్పందాన్ని బయటపెడతామన్న ఉత్తమ్
- పార్లమెంటు సమావేశాల్లో కేసీఆర్ అవినీతిని ప్రస్తావిస్తామన్న పీసీసీ చీఫ్
కేసీఆర్ అవినీతిపరుడని ఆరోపిస్తున్న తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఈ విషయంలో ఇప్పటి వరకు కేంద్రానికి ఎందుకు ఫిర్యాదు చేయలేదని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. గాంధీభవన్‌లో నిన్న ఆయన నేతృత్వంలో పార్టీ ముఖ్యనేతల సమావేశం జరిగింది. ఈ నెల 29 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రస్తావించాల్సిన అంశాల గురించి ఈ సమావేశంలో చర్చించారు.
అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ చేస్తున్న అవినీతిని పార్లమెంటులో ప్రస్తావించనున్నట్టు తెలిపారు. అలాగే, కాళేశ్వరం, సీతారామ, మిషన్ భగీరథ ప్రాజెక్టులపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తామని పేర్కొన్నారు. టీఆర్ఎస్, బీజేపీలు చీకటి ఒప్పందం చేసుకుని రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ రెండు పార్టీల బాగోతాన్ని ఢిల్లీ వేదికగా నిలదీస్తామన్నారు.
హైదరాబాద్ మెట్రో రైలును సంగారెడ్డి వరకు పొడిగించాలన్న డిమాండ్‌తోపాటు నల్లమలలో యురేనియం తవ్వకాలు, మేడారం జాతరకు జాతీయ పండుగ గుర్తింపు, పసుపు బోర్డు ఏర్పాటు, బీబీనగర్ ఎయిమ్స్, బయ్యారం ఉక్కుపరిశ్రమ వంటి అంశాలను పార్లమెంటులో లేవనెత్తుతామని ఉత్తమ్ కుమార్ పేర్కొన్నారు.
కేసీఆర్ అవినీతిపై తమ వద్ద ఉన్న ఆధారాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు, సీబీఐకి అందిస్తామని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.