TikTok: టిక్ టాక్ భారత ఉద్యోగాల్లో భారీ కోత: ప్రకటించిన బైట్ డాన్స్
- కీలక జాబ్స్ తప్ప మిగతా అందరి తొలగింపు
- ఉద్యోగులకు లేఖ రాసిన టిక్ టాక్ సీఈవో
- సమస్య కొన్ని రోజులే ఉంటుందనుకున్నామని వ్యాఖ్య
- గత్యంతరం లేని పరిస్థితుల్లో తొలిగిస్తున్నామని వెల్లడి
టిక్ టాక్ పై భారత్ శాశ్వత నిషేధం విధించడంతో.. దేశంలోని ఉద్యోగుల్లో కోత పెట్టింది ఆ యాప్ మాతృ సంస్థ బైట్ డాన్స్. భారత్ లో దాదాపు 2 వేల మందికిపైగా బైట్ డాన్స్ లో పనిచేస్తున్నారు. అయితే, ఏడు నెలలుగా అనిశ్చిత పరిస్థితుల్లో ఉన్న సంస్థకు.. శాశ్వత నిషేధంతో పెద్ద షాక్ తగిలింది. దీంతో కీలక అధికారులు, ఉద్యోగులు తప్ప మిగతా వారిని తీసేస్తున్నట్టు బుధవారం ఉదయం ప్రకటించింది. ఈ మేరకు ఉద్యోగులకు సీఈవో వేనెస్సా పాపాస్, అంతర్జాతీయ వాణిజ్య విభాగం వైస్ ప్రెసిడెంట్ బ్లేక్ షాండ్లీలు లేఖ రాశారు.
‘‘టిక్ టాక్ పై నిషేధం కొన్ని రోజులే ఉంటుందని ముందు ఆశించాం. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేశాం. కానీ, ఏడు నెలల తర్వాత పరిస్థితి మొత్తం తలకిందులైపోయింది. మీరంతా ఈ ఏడు నెలలు ఎంతో ఓపికగా, సహనంగా ఎదురు చూశారు. ఆ టైంలో మీరు ఎంత ఆందోళనకు గురై ఉంటారో అర్థం చేసుకుంటాం. ఇప్పటిదాకా మీరు మాపై పెట్టిన నమ్మకానికి కృతజ్ఞతలు.
అయితే, మేం తీసుకుంటున్న ఈ నిర్ణయం మీకు చాలా బాధ కలిగించొచ్చు. ఎవరినీ ఉద్యోగం నుంచి తీసేయకూడదనే మేం ఇన్నాళ్లూ ఆలోచించాం. అందుకోసం అన్ని ప్రయత్నాలూ చేశాం. ఖర్చు తగ్గించుకున్నాం. యాప్స్ పై నిషేధం విధించినా ఒక్కరి ఉద్యోగమూ తీసేయలేదు. ఆ నిర్ణయం ఎంతటి ప్రభావం చూపిస్తుందో మాకు తెలుసు. అయితే, ఇప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉద్యోగుల సంఖ్యలో కోత పెట్టాల్సి వస్తోంది. దానికి చింతిస్తున్నాం. మళ్లీ భారత్ మార్కెట్ లోకి కచ్చితంగా ఎప్పుడొస్తామో తెలియదు’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.