Chiranjeevi: వచ్చే ఎన్నికల నాటికి పవన్ తో కలిసి నడవనున్న చిరంజీవి..?... నాదెండ్ల ఆసక్తికర వ్యాఖ్యలు
- గతంలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన చిరంజీవి
- కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం విలీనం
- కేంద్రమంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించిన వైనం
- పవన్ కు అండగా నిలుస్తామని చిరంజీవి చెప్పారన్న మనోహర్!
మెగాస్టార్ చిరంజీవికి రాజకీయాలు కొత్త కాదు. గతంలో ఆయన ప్రజారాజ్యం పార్టీ స్థాపించడమే కాదు, కేంద్రమంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. పరిస్థితుల నేపథ్యంలో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన చిరంజీవి క్రమంగా రాజకీయాలకు దూరమయ్యారు. అయితే, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తాజాగా కార్యకర్తల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీని బలపరిచేవిగా ఉన్నాయి.
నాదెండ్ల మనోహర్ విజయవాడలో జనసేన సమావేశంలో మాట్లాడుతూ, పవన్ తో కలిసి నడిచేందుకు తాను సిద్ధమేనన్న సానుకూల సంకేతాలను చిరంజీవి అందించారని తెలిపారు. చిరంజీవి ఇచ్చిన సలహా మేరకే పవన్ మళ్లీ సినిమాల్లో నటిస్తున్నారని మనోహర్ వెల్లడించారు. మరో మూడేళ్లు సినిమాలు చేసిన తర్వాత పూర్తిస్థాయిలో రాజకీయాలు చేసుకోవాలని పవన్ కు సూచించారని వివరించారు పవన్ రాజకీయ ప్రస్థానంలో తాను కూడా అండగా నిలుస్తానని చిరంజీవి చెప్పారని వివరించారు.