NIA: వరవరరావు ఆరోగ్యం నిలకడగానే ఉంది, బెయిల్ ఇవ్వొద్దు... కోర్టును కోరిన ఎన్ఐఏ
- ఎల్గార్ పరిషద్ కేసులో జైల్లో ఉన్న వరవరరావు
- అనారోగ్యంతో ఆసుపత్రిపాలు
- వరవరరావు కోలుకున్నాడన్న ఎన్ఐఏ
- కోలుకుంటే అన్ని మందులు ఎందుకు వాడుతున్నాడన్న కోర్టు
ఎల్గార్ పరిషద్ కేసులో జైల్లో ఉన్న విరసం నేత వరవరరావు కు బెయిల్ ఇవ్వొద్దని ఈ కేసును విచారిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) బాంబే హైకోర్టును కోరింది. వరవరరావు ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆరోగ్యపరమైన కారణాలతో ఆయనకు బెయిల్ అవసరం లేదని పేర్కొంది. ఈ సందర్భంగా ఎన్ఐఏ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ వాదనలు వినిపించారు.
ఈ నెల మొదట్లో ముంబయి నానావతి ఆసుపత్రి వరవరరావు ఆరోగ్యం బాగానే ఉందంటూ నివేదిక ఇచ్చిందని, ఇక డిశ్చార్జి చేయొచ్చని తెలిపిందని అనిల్ సింగ్ కోర్టుకు వివరించారు. అయితే హైకోర్టు ఎన్ఐఏ వాదనల పట్ల అభ్యంతరం చెప్పింది. వరవరరావు ఇప్పటికీ రోజుకు 20 మాత్రలు వేసుకుంటున్నారని, ఆరోగ్య పరిస్థితి బాగుంటే అన్ని మాత్రలు ఎందుకు వేసుకుంటారని జస్టిస్ ఎస్ఎస్ షిండే, జస్టిస్ మనీశ్ పితాలే ధర్మాసనం ప్రశ్నించింది. ఆయన వాడుతున్న ఔషధాల జాబితా చూడండి... దాన్నిబట్టి ఆయన ఇంకా అస్వస్థతతో ఉన్నారని, వైద్య చికిత్సపై ఆధారపడి ఉన్నట్టుగానే భావించాలని పేర్కొంది.
దాంతో అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ స్పందిస్తూ, వరవరరావు వాడుతున్న మాత్రల్లో అత్యధికం వయసు సంబంధ సమస్యలకు వాడుతున్నవేనని వివరించే ప్రయత్నం చేశారు. తమ ఇళ్లలో ఉండే 70, 80 ఏళ్ల వృద్ధులు కూడా ఇలాంటి మాత్రలే వాడుతుంటారని తెలిపారు.
దాంతో, ద్విసభ్య ధర్మాసనం స్పందిస్తూ... జేజే హాస్పిటల్, నానావతి ఆసుపత్రి, సెయింట్ జార్జి ఆసుపత్రి కూడా వరవరరావు డిమెన్షియా, బ్రెయిన్ అట్రోఫీ వంటి తీవ్ర సమస్యలతో బాధపడుతున్నట్టు నివేదికలు ఇచ్చాయి కదా? అని పేర్కొంది. అయితే అవి పాత రిపోర్టులని అనిల్ సింగ్ తెలిపారు.
ఈ నేపథ్యంలో హైకోర్టు వరవరరావుకు సంబంధించిన తాజా ఆరోగ్య నివేదికను గురువారం ఉదయానికల్లా సమర్పించాలని నానావతి ఆసుపత్రిని ఆదేశిస్తూ, విచారణను రేపటి మధ్యాహ్నానికి వాయిదా వేసింది.