Movie Theaters: థియేటర్లలో సీటింగ్ సామర్థ్యం పెంపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- ఇటీవలే థియేటర్లకు ప్రభుత్వం అనుమతి
- ప్రస్తుతం 50 శాతం సీటింగుకే అనుమతి
- ప్రభుత్వ ఆదేశాలపై యాజమాన్యాల హర్షం
కరోనా కారణంగా మూతపడి మళ్లీ తెరుచుకుని 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో నడుస్తున్న సినిమా థియేటర్లకు కేంద్రం శుభవార్త చెప్పింది. సీటింగ్ సామర్థ్యాన్ని పెంచేందుకు అనుమతినిస్తూ కేంద్ర సమాచార, ప్రసారశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది.
ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి సీటింగ్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చని తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, ఎంతమేరకు పెంచుకోవచ్చన్న విషయంలో స్పష్టత నివ్వలేదు. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కరోనా వైరస్ కారణంగా గతేడాది మూతబడిన సినిమా థియేటర్లు ఇటీవలే మళ్లీ తెరుచుకున్నాయి.
అయితే, 50 శాతం సీటింగ్కు మాత్రమే అనుమతి నిచ్చింది. ఇలా సగం మంది ప్రేక్షకులతో థియేటర్లను నడిపించడం వల్ల నష్టాల పాలవుతున్నామని థియేటర్ యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వ్యాపార కార్యకలాపాలు అన్నింటికి దాదాపు అనుమతులిచ్చిన ప్రభుత్వం థియేటర్ల విషయంలో మాత్రం ఆంక్షలు విధించడం సబబు కాదని ప్రభుత్వానికి విన్నవించాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తాజా మార్గదర్శకాలపై థియేటర్ యాజమాన్యాలు హర్షం వ్యక్తం చేశాయి.