Sunny Deol: ఆ వార్తలు పూర్తిగా అవాస్తవం.. నటుడు దీప్ సిద్ధూతో సంబంధాలపై బీజేపీ ఎంపీ సన్నీ డియోల్
- రైతుల ఎర్రకోట ముట్టడికి దీప్ సిద్ధూయే కారణమని వార్తలు
- మోదీ, సన్నీడియోల్‌తో సిద్ధూ కలిసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్
- సన్నీ గెలుపు కోసం ప్రచారం చేసిన సిద్ధూ
సినీ నటుడు దీప్ సిద్ధూతో తనకు కానీ, తన కుటుంబ సభ్యులకు కానీ ఎలాంటి సంబంధం లేదని బాలీవుడ్ నటుడు, బీజేపీ ఎంపీ సన్నీడియోల్ స్పష్టం చేశాడు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో నిన్న రైతులు నిర్వహించిన ట్రాక్టర్ పరేడ్ హింసాత్మకంగా మారింది. ఈ సందర్భంగా రైతులు ఎర్రకోటను ముట్టడించారు.
ఈ ముట్టడి వెనక పంజాబ్‌కు చెందిన సినీ నటుడు దీప్ సిద్ధూ ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అంతేకాదు, సిద్ధూకు నటుడు సన్నీడియోల్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న ప్రచారం జరిగింది. దీంతో స్పందించిన సన్నీడియోల్ ఓ ట్వీట్ ద్వారా స్పష్టత ఇచ్చారు. ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై విచారం వ్యక్తం చేసిన సన్నీ.. దీప్ సిద్ధూతో తనకు, తన కుటుంబ సభ్యులకు ఎలాంటి సంబంధాలు లేవన్నారు. గతంలోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్టు చెప్పారు.
కాగా, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో గురుదాస్‌పూర్ నుంచి పోటీ చేసిన సన్నీడియోల్ విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో సన్నీకి మద్దతుగా సిద్ధూ ప్రచారం చేశారు. అయితే, సిద్ధూ రైతుల ఉద్యమంలో పాల్గొన్నప్పటి నుంచి సన్నీ ఆయనకు దూరంగా ఉంటున్నారు. నిన్న ఎర్రకోట ముట్టడికి పురిగొల్పింది సిద్ధూయేనన్న వార్తలు షికారు చేశాయి. అంతేకాదు, ప్రధాని నరేంద్రమోదీ, సన్నీడియోల్, దీప్ సిద్ధూ కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో సన్నీడియోల్ ఇలా స్పందించారు.