UFO: ఆకాశంలో గుర్తు తెలియని వస్తువును గుర్తించిన పాకిస్థాన్ పైలట్
- ఈ నెల 23న ఘటన
- లాహోర్ నుంచి కరాచీ వెళుతున్న విమానం
- రహీమ్ యార్ ఖాన్ ప్రాంతంలో కనిపించిన వస్తువు
- ప్రకాశవంతంగా మెరిసిపోయిన వస్తువు
- కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించిన పైలెట్
ఆకాశంలో గుర్తు తెలియని వస్తువులు (యూఎఫ్ఓ) ఎప్పటినుంచో మానవాళికి మిస్టరీగానే ఉన్నాయి. వాటిని చూశామని చెప్పినవాళ్లే తప్ప స్పష్టమైన ఆధారాలు ఇంతవరకు లభ్యం కాలేదు. కొన్ని ఫొటోలు అందుబాటులో ఉన్నా, స్పష్టత అంతంతమాత్రమే. దాంతో కొన్ని దశాబ్దాలుగా యూఎఫ్ఓల గురించి చర్చ కొనసాగుతూనే ఉంది. తాజాగా పాకిస్థాన్ కు చెందిన ఓ విమాన పైలెట్ ఆకాశంలో వెలిగిపోతున్న ఓ గుర్తు తెలియని వస్తువును గుర్తించాడు.
ఈ నెల 23న పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ (పీఐఏ)కు చెందిన విమానం లాహోర్ నుంచి కరాచీ వెళుతుండగా, మార్గమధ్యంలో రహీమ్ యార్ ఖాన్ ప్రాంతంలో ఆకాశంలో కాంతివంతమైన వస్తువు పైలట్ కంటబడింది. సాయంత్రం వేళ కావడంతో ఆ వస్తువు కిందనున్న ప్రజలకు కూడా దర్శనమిచ్చింది. దాంతో చాలామంది దాన్ని వీడియో తీశారు. ఆ గుర్తు తెలియని వస్తువు గురించి పీఐఏ పైలట్ కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించాడు. అయితే, ఇది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కానీ, లేక మరేదైనా భారీ ఉపగ్రహం కానీ అయ్యుండొచ్చని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.