Farm Laws: మోదీ ప్రభుత్వాన్ని మరోమారు కోరుతున్నా.. రాహుల్ గాంధీ ట్వీట్
- వ్యవసాయ చట్టాలను రైతు వ్యతిరేక చట్టాలుగా పేర్కొన్న రాహుల్
- మహాత్మాగాంధీ సూక్తిని ట్వీట్ చేసిన కాంగ్రెస్ నేత
- ఢిల్లీ ఘటనపై కేంద్రం సీరియస్
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు గణతంత్ర దినోత్సవం రోజు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ, ఎర్రకోట ముట్టడి హింసాత్మకంగా మారాయి. ఈ ఘటనలో 300 మందికిపైగా పోలీసులు గాయపడ్డారు. ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఢిల్లీ ఘటనపై ఇప్పటి వరకు 200 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 22 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు.
ఇక ఢిల్లీలో చోటుచేసుకున్న ఘటనలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిన్న స్పందించారు. కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలను రైతు వ్యతిరేక చట్టాలుగా పేర్కొన్న ఆయన.. వాటిని రద్దు చేయాలని మోదీ ప్రభుత్వాన్ని మరోమారు అభ్యర్థిస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ‘సున్నితమైన మార్గంలో మీరు ప్రపంచాన్ని కదిలించవచ్చు’ అన్న మహాత్మాగాంధీ సూక్తిని రాహుల్ ట్వీట్ చేశారు.