Rakesh Tikait: రాకేశ్​ తికాయత్ ​ఒకప్పుడు పోలీస్​ కానిస్టేబుల్​ .. 44 సార్లు జైలుకెళ్లిన రైతు నేత!

Rakesh Tikait once constable in Delhi Police has been jailed 44 times

  • 1985లో పోలీస్ ఉద్యోగం.. ఐదేళ్లకే రాజీనామా
  • తండ్రితో కలిసి రైతు ఉద్యమంలో పోరాటం
  • రెండు సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి

రాకేశ్ తికాయత్.. ట్రాక్టర్ ర్యాలీ హింసలో దీప్ సిద్ధూ తర్వాత చాలా ఎక్కువగా వినిపిస్తున్న పేరిది. భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత ఆయన. ఇప్పటికే ఆయనపై పోలీసులు లుకవుట్ నోటీసులు జారీ చేశారు. అయితే, తాను లొంగిపోయే ప్రసక్తే లేదని, చట్టాలు రద్దు చేసే దాకా ఆందోళన చేస్తూనే ఉంటానని తేల్చి చెప్పారు. ఘజియాబాద్ కలెక్టర్ వచ్చి అల్టిమేటం ఇచ్చినా పట్టు వీడలేదు.

అయితే, ఆయనా ఒకప్పుడూ పోలీసే. ఉత్తర్ ప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో పుట్టిన ఆయన.. లా చదివారు. ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ గా 1985లో చేరారు. అయితే, ఐదేళ్లకే ఉద్యోగాన్ని వదిలేశారు. 1990లో తన తండ్రి మహేంద్ర సింగ్ తికాయత్ ఆధ్వర్యంలో ఎర్రకోట వద్ద నడిచిన రైతు ఉద్యమంలో పాల్గొన్నారు.

ఇప్పటిదాకా ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్న ఆయన 44 సార్లు జైలుకు వెళ్లి వచ్చారు. భూ సేకరణ చట్టానికి వ్యతిరేకంగా చేసిన ఆందోళనల్లో రాకేశ్ పై మధ్యప్రదేశ్ లో కేసులు నమోదయ్యాయి. అక్కడ 39 రోజులు జైలు జీవితం గడిపారు. చెరకుకు గిట్టుబాటు ధర పెంచాలంటూ పార్లమెంట్ ముందు ధర్నా చేయగా.. తీహార్ జైలులో పెట్టారు. రైతు ఉద్యమానికి సంబంధించి జైపూర్ లోనూ జైలుకెళ్లారు.

రాజకీయాల్లోనూ రెండు సార్లు తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 2007లో తొలిసారిగా ముజఫర్ నగర్ లోని ఖతౌలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. 2014లో ఆమ్రోహా జిల్లా నుంచి రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ తరఫున ఎంపీగా బరిలోకి దిగారు. ఆ రెండు ఎన్నికల్లోనూ ఓడిపోయారు.

  • Loading...

More Telugu News