Serum Institute Of India: మరో కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ కు సీరమ్ దరఖాస్తు
- వెల్లడించిన సంస్థ సీఈవో అదర్ పూనావాలా
- త్వరలోనే అనుమతి వస్తుందని ఆశాభావం
- అమెరికా సంస్థ నోవావ్యాక్స్ తో సీరమ్ జట్టు
- బ్రిటన్ ట్రయల్స్ లో 89.3% సత్ఫలితాలు వచ్చాయన్న నోవావ్యాక్స్
దేశంలో మరో కరోనా వ్యాక్సిన్ ట్రయల్ కోసం సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా దరఖాస్తు చేసింది. ఇప్పటికే ఆక్స్ ఫర్డ్– ఆస్ట్రాజెనికా కలిసి అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ను కొవిషీల్డ్ పేరుతో మన దేశంలో సీరమ్ మార్కెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. రెండు వారాల క్రితమే ఆ టీకాల పంపిణీ కూడా మొదలైంది.
అయితే, తాజాగా అమెరికాకు చెందిన నోవావ్యాక్స్ అనే కంపెనీ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ కోసం సీరమ్ దరఖాస్తు చేసుకుంది. ఈ విషయాన్ని సీరమ్ సంస్థ సీఈవో అదర్ పూనావాలా నేడు వెల్లడించారు. బ్రిటన్ లో నిర్వహించిన మూడో దశ ట్రయల్స్ లో టీకా 89.3 శాతం వరకు సత్ఫలితాలనిచ్చినట్టు నోవావ్యాక్స్ వెల్లడించిన కొన్ని గంటలకే మన దేశంలోనూ ట్రయల్స్ కు దరఖాస్తు చేసినట్టు ఆయన వెల్లడించారు.
కొన్ని రోజుల క్రితమే బ్రిడ్జింగ్ ట్రయల్స్ కోసం ఔషధ నియంత్రణ సంస్థకు దరఖాస్తు చేసుకున్నామని ఆయన చెప్పారు. త్వరలోనే దానికి అనుమతి వచ్చే అవకాశాలున్నాయన్నారు. బ్రిటన్ లో ఈ వ్యాక్సిన్ ను 15 వేల మందిపై ప్రయోగించి చూస్తున్నారు. 18 నుంచి 84 ఏళ్ల మధ్య వయస్కులు ట్రయల్స్ లో పాల్గొంటున్నారు.