Buggana Rajendranath: గత ప్రభుత్వ పొరపాట్లను కేంద్ర జలశక్తి కార్యదర్శికి వివరించాను: బుగ్గన
- పోలవరం ప్రాజెక్టు పూర్వాపరాలను వివరించాను
- ఓర్వకల్లు విమానాశ్రయం గురించి ఆర్కే సింగ్ తో చర్చించాను
- రాష్ట్రానికి ఆర్థిక సాయం చేయమని కేంద్రాన్ని కోరుతున్నాం
పోలవరం ప్రాజెక్టు పూర్వాపరాలను కేంద జలశక్తి కార్యదర్శి పంకజ్ కు వివరించానని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పొరపాట్లను ఆయనకు వివరించానని చెప్పారు. ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన వారికి పునరావాసం, పరిహారం తదితర అంశాలపై చర్చించానని తెలిపారు.
పౌర విమానాశ్రయ అధికారులను కూడా కలిశానని... కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని విమానాశ్రయంలో కమర్షియల్ రాకపోకలపై వారితో చర్చించామని బుగ్గన చెప్పారు. ఈ అంశంపై త్వరలో నిర్ణయం తీసుకోవాలని కోరానని తెలిపారు. అప్పర్ సీలేరు ప్రాజెక్టు రివర్స్ పంపింగ్ పై కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ తో నిన్న చర్చించానని చెప్పారు. ఇది విద్యుత్ ఆదా చేసే ప్రాజెక్ట్ అని, అందువల్ల కేంద్రం తరపున సాయం చేయాలని కోరామని తెలిపారు.
కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో వచ్చే వాటిని పరిశీలిస్తున్నామని చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన అన్ని నిధులను వెంటనే విడుదల చేయాలని ఈ బడ్జెట్ సమావేశాల్లో కేంద్రాన్ని కోరుతామని అన్నారు. రాష్ట్ర పునర్విభజన వల్ల నష్టం జరిగిందని, అందువల్ల రాష్ట్రానికి సాయం చేయాలని కేంద్రాన్ని కోరుతున్నామని చెప్పారు.