V Prashanth Reddy: తండ్రి వయసున్న కేసీఆర్ పై బీజేపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు: మంత్రి ప్రశాంత్ రెడ్డి

Prashanth Reddy slams Bandi Sanjay and Dharmapuri Arvind

  • సీఎం కేసీఆర్ లక్ష్యంగా బీజేపీ నేతల విమర్శల దాడి
  • బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారన్న ప్రశాంత్ రెడ్డి
  • బండి సంజయ్, ధర్మపురి అరవింద్ లపై ఆగ్రహం
  • సంస్కార హీనుల్లా మాట్లాడొద్దని హితవు

తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ నేతలు విమర్శనాస్త్రాలు, సవాళ్లు సంధిస్తుండడం పట్ల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. తండ్రి వయసున్న కేసీఆర్ పై బీజేపీ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా బండి సంజయ్, ధర్మపురి అరవింద్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, వీరిద్దరూ పరిధి మీరితే బాగుండదని ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ పైనా, టీఆర్ఎస్ సర్కారుపైనా ఎప్పుడూ తప్పుడు ప్రచారాలు చేయడమే వీరి పని అని విమర్శించారు. బీజేపీ నేతలకు సంస్కారం లేదని అన్నారు.

టీఆర్ఎస్ సర్కారు రూ.2016 పెన్షన్ ఇస్తోందని, అందులో కేంద్రం వాటా రూ.200 మాత్రమేనని మంత్రి వెల్లడించారు. కేంద్రం తన వాటాకు మించి ఒక్క రూపాయి ఎక్కువ ఇస్తున్నట్టు నిరూపిస్తే తాను మంత్రి పదవి నుంచి తప్పుకోవడానికి సిద్ధమేనని, నిరూపించలేకపోతే ఎంపీ పదవి నుంచి అరవింద్ వైదొలుగుతారా? అని ప్రశాంత్ రెడ్డి సవాల్ విసిరారు.

ఇళ్ల నిర్మాణాల విషయంలోనూ బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని, కేసీఆర్ సర్కారు రూ.4.32 లక్షలు ఇస్తుంటే, అందులో కేంద్రం వాటా రూ.72 వేలు మాత్రమేనని వివరించారు. ఏదైనా ప్రజాసంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడితే సబబుగా ఉంటుందని, సంస్కార హీనుల్లా మాట్లాడొద్దని ప్రశాంత్ రెడ్డి తెలంగాణ బీజేపీ ముఖ్యనేతలకు హితవు పలికారు.

  • Loading...

More Telugu News