Nimmagadda Ramesh: నా ఆదేశాలను ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు తప్పవు: సీఎస్ కు నిమ్మగడ్డ రమేశ్ లేఖ
- ప్రవీణ్ ప్రకాశ్ ను తొలగించాలని గతంలో సీఎస్ కు సూచించిన నిమ్మగడ్డ
- ఇంత వరకు చర్యలు తీసుకోని ప్రభుత్వం
- కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందన్న నిమ్మగడ్డ
పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ను తొలగించాలంటూ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఈసీ హోదాలో ఉన్న అధికారి ఆదేశాలను పాటించకపోవడం చట్ట విరుద్ధమని చెప్పారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కు లేఖ రాశారు.
తన ఆదేశాలను అమలు చేయకపోవడం కోర్టు ధిక్కరణ అవుతుందని చెప్పారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. వీడియో కాన్ఫరెన్స్ జరగకుండా చూశానని ప్రవీణ్ ప్రకాశ్ అంగీకరించారని చెప్పారు. ఎన్నికలకు సహకరించని అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ నెల 23న కలెక్టర్లు, ఎస్పీలతో జరగాల్సిన వీడియో కాన్ఫరెన్స్ జరగకుండా ప్రవీణ్ ప్రకాశ్ చేశారని, తన ఆదేశాలను పట్టించుకోలేదని గతంలో సీఎస్ కు నిమ్మగడ్డ లేఖ రాశారు. ఆయనను తక్షణమే విధుల నుంచి తొలగించాలని సూచించారు. తన ఆదేశాలు అమలు కాకపోవడంపై సీఎస్ కు నిమ్మగడ్డ మరోసారి లేఖ రాశారు.