Nimmagadda Ramesh: సీబీఐ నమోదు చేసిన ఆ అవినీతి కేసుల్లో సాక్ష్యం చెపుతాను: నిమ్మగడ్డ
- వైయస్ హయాంలో ఫైళ్లపై సంతకాలు చేసేటప్పుడు నా అభిప్రాయాలు నిక్కచ్చిగా చెప్పేవాడిని
- ఆ తర్వాత అవినీతికి సంబంధించి సీబీఐ కేసులు నమోదయ్యాయి
- ఈ కేసుల్లో నేను కోర్టులో సాక్ష్యం చెప్పాను
కడప జిల్లా పర్యటనలో ఉన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో తాను ఫైనాన్స్ సెక్రటరీగా పని చేశానని, ఎన్నో ఫైళ్లపై సంతకాలు చేశానని చెప్పారు. ఫైళ్లపై సంతకం చేసే సమయంలో తన అభిప్రాయాలను కచ్చితంగా చెప్పేవాడినని తెలిపారు. ఆ తర్వాత కొన్ని సీబీఐ కేసులు నమోదయ్యాయని, కేసుల విచారణలో భాగంగా కోర్టులో తాను సాక్ష్యం చెప్పానని అన్నారు. ప్రస్తుతం ఆ కేసుల విచారణ కొనసాగుతోందని, కోర్టు తనను మళ్లీ పిలుస్తుందని, అప్పుడు కూడా సాక్ష్యం చెపుతానని తెలిపారు.
తనకు ఏ మాత్రం భయం లేదని చెప్పారు. తన పనిని తాను బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నానని, అందువల్ల భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. కోర్టులో సాక్ష్యం చెప్పడానికి కూడా తనకు భయం లేదని అన్నారు. సాక్ష్యం చెప్పేవారికి అపెక్స్ కోర్టు ఎలాంటి భద్రతను కల్పిస్తుందో అందరికీ తెలుసని చెప్పారు. నిమ్మగడ్డ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.