Republic Day: రిపబ్లిక్ డే ట్వీట్స్: శశిథరూర్, సీనియర్ పాత్రికేయులపై హర్యానాలోనూ కేసులు
- గణతంత్ర దినోత్సవం నాడు రైతుల ట్రాక్టర్ ర్యాలీ
- హింసాత్మకంగా మారిన ర్యాలీ
- శశిథరూర్, పాత్రికేయులపై కేసు నమోదు చేసిన బీజేపీ పాలిత మూడో రాష్ట్రం
కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్, సీనియర్ పాత్రికేయులు రాజ్‌దీప్ సర్దేశాయ్, మృణాల్ పాండేలపై తాజాగా హర్యానాలోనూ కేసులు నమోదయ్యాయి. రిపబ్లిక్ డే నాడు ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. అయితే, ఈ విషయంలో వీరంతా సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేశారన్న ఆరోపణలపై ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో కేసులు నమోదయ్యాయి. తాజాగా, బీజేపీ పాలిత హర్యానాలోనూ ఎఫ్ఐఆర్ నమోదైంది.
గురుగ్రామ్‌లోని ఝార్సాకు చెందిన మహావీర్ సింగ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. శశిథరూర్, రాజ్‌దీప్ సర్దేశాయ్, మృణాల్ పాండేలపై దేశద్రోహం, నేరపూరిత కుట్ర వంటి కేసులు నమోదయ్యాయి. పరువు నష్టం, తప్పుదోవ పట్టించే ట్వీట్లు చేసినట్టు ఆయన ఆరోపించారు. కాగా, గణతంత్ర దినోత్సవం నాడు రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారింది. వారిని అదుపు చేసే క్రమంలో పలువురు పోలీసులు గాయపడ్డారు. ట్రాక్టర్ బోల్తాపడి ఓ యువ రైతు ప్రాణాలు కోల్పోయాడు.