Farm Laws: ఢిల్లీలోని శిబిరాలకు భారీగా తరలివస్తోన్న రైతులు
- పలు రాష్ట్రాల నుంచి గాజీపుర్కు రాక
- ఎల్లుండి సరిహద్దులకు భారీగా తరలివస్తామని ఇప్పటికే రైతుల వెల్లడి
- రైతుల ఉద్యమానికి నిన్న మరింత పెరిగిన మద్దతు
రైతులతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల జరిపిన చర్చలు విఫలం కావడంతో మరోసారి చర్చలు జరిపే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, రైతులతో చర్చలకు సిద్ధమని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ప్రకటించారు. దీంతో తాము కూడా చర్చలకు సిద్ధంగా ఉన్నామని రైతు సంఘాలు తెలిపాయి.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాల రద్దు, మద్దతు ధరకు చట్టబద్ధతపై చర్చించాలని డిమాండ్ చేశాయి. మరోవైపు, ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయాలని పోలీసులు చూస్తున్నారని కిసాన్ మోర్చా ఆరోపించింది. రైతుల ఆందోళన ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
ఈ రోజు సాయంత్రం వరకు ఆందోళన ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. రైతులు తమ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తున్నారు. ఢిల్లీ శిబిరాలకు రైతులు భారీగా తరలివస్తున్నారు. పలు రాష్ట్రాల నుంచి గాజీపుర్కు వస్తున్నారు.
ఎల్లుండి సరిహద్దులకు భారీగా తరలివస్తామని ఇప్పటికే రైతులు వెల్లడించారు. రైతుల ఉద్యమానికి నిన్న మద్దతు మరింత పెరిగింది. గాజీపుర్లోని ఢిల్లీ-మేరఠ్ రహదారిపై శిబిరానికి రైతులు భారీ సంఖ్యలో వస్తున్నారు. వచ్చేనెల 2న రికార్డు స్థాయిలో రైతుల మోహరింపు ఉంటుందని రైతు సంఘాలు చెప్పాయి.