Tamil Nadu: రాజీవ్‌గాంధీ హత్యకేసు దోషుల విడుదలకు పళని ప్రభుత్వం ఆమోదం.. న్యాయనిపుణులతో గవర్నర్ చర్చలు
- గవర్నర్ రేపు తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం
- తనను విడుదల చేయాలంటూ సుప్రీంలో పేరరివాలన్ పిటిషన్
- వారం రోజుల్లో నిర్ణయం ప్రకటించాలన్న సుప్రీంకోర్టు
రాజీవ్‌గాంధీ హత్యకేసు దోషులు మురుగన్, నళిని, పేరరివాలన్ సహా ఏడుగురిని విడుదల చేయాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం చేసిన ఏకగ్రీవ తీర్మానంపై ఆ రాష్ట్ర గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ స్పందించారు. విడుదలకు సంబంధించి ఉన్న చిక్కుముడులు, మార్గాలపై రాజభవన్‌లో న్యాయనిపుణులతో సుదీర్ఘంగా చర్చించారు. రాజీవ్ దోషుల విడుదలకు సంబంధించి గవర్నర్ రేపు (సోమవారం) తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని తెలుస్తోంది.
కాగా, తనను విడుదల చేయాలని కోరుతూ పేరరివాలన్ ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. దానిపై జరిగిన విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. దోషుల విడుదలపై నాలుగైదు రోజుల్లో గవర్నర్ తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని తెలిపారు. స్పందించిన సుప్రీం ధర్మాసనం ఏ నిర్ణయం తీసుకున్నది వారం రోజుల్లోగా తెలపాలని సూచించింది. ఈ నేపథ్యంలో గవర్నర్ కార్యదర్శి విష్ణు ఢిల్లీ వెళ్లి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు, న్యాయనిపుణులతో చర్చించారు. తాజాగా, న్యాయనిపుణులతో చర్చించిన గవర్నర్ భన్వరీలాల్ సోమవారం తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.