Madanapalle Incident: డంబెల్ ను శివుడి ఢమరుకంగా భావించి హత్యలు చేసుంటారు... మదనపల్లె ఘటనపై న్యాయవాది రజని వ్యాఖ్యలు

Advocate Rajini met Purushotham Naidu at Madanapalle Sub Jail

  • తీవ్ర కలకలం రేపిన మదనపల్లె జంట హత్యలు
  • తల్లిదండ్రుల చేతిలో కడతేరిన అలేఖ్య, సాయిదివ్య
  • తల్లిదండ్రులు పద్మజ, పురుషోత్తంనాయుడులకు రిమాండ్
  • జైల్లో పురుషోత్తంనాయుడును కలిసిన న్యాయవాది రజని

చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఇటీవల పద్మజ, పురుషోత్తంనాయుడు అనే దంపతులు తమ కుమార్తెలు అలేఖ్య, సాయిదివ్యలను అంతమొందించిన ఘటనపై ఇప్పటికీ పూర్తి స్పష్టత రాలేదు. తాజాగా ఈ అంశంపై హైకోర్టు న్యాయవాది రజని మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదుకు చెందిన కృష్ణమాచార్య అనే న్యాయవాది తరఫున ఆమె మదనపల్లె సబ్ జైలులో ఉన్న పద్మజ, పురుషోత్తంనాయుడలను కలిసే ప్రయత్నం చేశారు. అయితే, పోలీసులు పురుషోత్తంనాయుడుతో మాట్లాడేందుకు కొన్ని నిమిషాల అనుమతి మంజూరు చేశారు. అది కూడా చాలా దూరం నుంచి పురుషోత్తంనాయుడుతో మాట్లాడించారు.

దీనిపై రజని మాట్లాడుతూ, నిందితులకు న్యాయసహాయం అవసరమని తాము భావిస్తున్నామని, ఈ కేసులో అనేక అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఘటన స్థలంలో జరిగింది క్షుద్రపూజలని చెబుతున్నారని, కానీ అక్కడ శివుడి పూజలు జరిగి ఉండొచ్చని పేర్కొన్నారు. పద్మజ, పురుషోత్తంనాయుడు దంపతులు తమకు కనిపించిన డంబెల్ నే శివుడి ఢమరుకంగా భావించి కుమార్తెల తలపై బలంగా మోది చంపేసి ఉంటారని వివరించారు. నేనే శివుడ్ని అనుకుంటూ డంబెల్ తో కొట్టి, మళ్లీ బతికి వస్తారని భావించారని తెలిపారు.

అసలు, తమ ఇద్దరు బిడ్డలు చనిపోయారన్న స్పృహ వారిలో లేదని, పూజ మధ్యలో పోలీసులు బూట్లతో వెళ్లి భంగం కలిగించడం వల్ల తమ కుమార్తెలు తిరిగి రాలేదన్న భ్రమలో ఉండిపోయారని చెప్పారు. ఈ కేసులో ఇంకెన్నో విషయాలు తెలియాల్సి ఉందని రజని అభిప్రాయపడ్డారు. పద్మజ, పురుషోత్తంనాయుడులను ఈ హత్యలకు ప్రేరేపించినవారికి శిక్షలు వేయాలని అన్నారు.

పురుషోత్తంనాయుడుతో మాట్లాడడం ద్వారా కొన్ని విషయాలు తెలిశాయని వెల్లడించారు. భోపాల్ లో ఉన్న సమయంలో అలేఖ్య ఆధ్యాత్మిక శక్తిని ఆవాహన చేయడం నేర్చుకుందని చెప్పారని వివరించారు. అమ్మాయిలకు రక్షణ లేదని భావించడం వల్లే అలేఖ్య ఆధ్యాత్మిక శక్తి కోసం ప్రయత్నించినట్టు అర్థమవుతోందని అన్నారు. అయితే, జైలులో దూరంగా ఉంచి మాట్లాడించడం వల్ల మరిన్ని విషయాలు తెలుసుకోలేకపోయానని రజని వివరించారు.

  • Loading...

More Telugu News