Vijayawada: విఘ్నేశ్వరాలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేసింది పూజారే: 'సిట్' డీఐజీ అశోక్ కుమార్
- ఈ నెల ఒకటిన విగ్రహం ధ్వంసం
- పూజారికి డబ్బు ఆశ చూపించి ధ్వంసం చేయించిన వైనం
- పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్న సిట్ డీఐజీ
రాజమహేంద్రవరంలోని శ్రీరాంనగర్ విఘ్నేశ్వరాలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని ఆలయ పూజరి మరల వెంకటమురళీకృష్ణే డబ్బు ఆశతో ధ్వంసం చేశాడని పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు 'సిట్' డీఐజీ అశోక్ కుమార్ తెలిపారు.
ఈ నెల ఒకటో తేదీన విగ్రహం ధ్వంసం కాగా, కేసు నమోదు చేసిన పోలీసులు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు నిర్ధారించారు. పూజారి వెంకట మురళీకృష్ణతోపాటు మల్ల వెంకటరాజు, దంతులూరి వెంకటపతిరాజులను అరెస్ట్ చేశారు.
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పూజారికి డబ్బు ఆశ చూపించి ఆయనతోనే విగ్రహాన్ని ధ్వంసం చేయించారని పోలీసులు తెలిపారు. ఇందుకోసం ఆయనకు రూ. 30 వేలు ఇచ్చినట్టు తెలిపారు. రాజకీయ లబ్ది కోసమే ఇలా చేయించినట్టు గుర్తించామని పేర్కొన్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతుందని, పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని డీఐజీ అశోక్ కుమార్ చెప్పారు.