Gorantla Butchaiah Chowdary: ఏపీలో మెట్రో రైలు గురించి బడ్జెట్లో ఎక్కడా ప్రస్తావించకపోవడం దారుణం: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
- బడ్జెట్-2021ని ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి నిర్మల
- ఏపీ ఊసే లేకుండా పోయిందన్న టీడీపీ నేత గోరంట్ల
- ఇతర నగరాలకు కేటాయింపులు చేశారని వెల్లడి
- రాష్ట్రాన్ని విస్మరించారని విమర్శలు
దేశ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్-2021ని పార్లమెంటులో ప్రవేశపెట్టిన నేపథ్యంలో విమర్శలు మొదలయ్యాయి. కేంద్ర బడ్జెట్ లో మెట్రో రైలు కేటాయింపుల్లో ఏపీ ఊసే లేకుండా పోయిందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. రాష్ట్రంలో కొత్తగా మెట్రో కేటాయింపులకు సంబంధించి ఎక్కడా పేర్కొనలేదని వెల్లడించారు. కేరళ, చెన్నై, నాగ్ పూర్, బెంగళూరు మెట్రోల అభివృద్ధికి, రెండో దశకు మాత్రం కేటాయింపులు జరిగాయని పేర్కొన్నారు.
చెన్నై మెట్రో రైలు వ్యవస్థకు రూ.63,246 కోట్లు, బెంగళూరు మెట్రో రైలు వ్యవస్థకు రూ.14,788 కోట్లు కేటాయించారని, వీటితో పాటే నాసిక్ లో కొత్త కారిడార్ ఏర్పాటుకు కూడా కేటాయింపులు జరిగాయని బుచ్చయ్య చౌదరి వివరించారు. కానీ, ఆంధ్రప్రదేశ్ లో మెట్రో రైలు గురించి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఎక్కడా పేర్కొనకపోవడం దారుణమని అభిప్రాయపడ్డారు.