Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలోనూ టీమిండియా ప్రస్తావన
- ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ విజయభేరి
- 2-1తో టెస్టు సిరీస్ కైవసం
- మన కుర్రాళ్ల విజయదాహానికి నిదర్శనమన్న నిర్మల
- యువత అపారమైన భరోసా ఇస్తోందని వ్యాఖ్య
- బడ్జెట్ ప్రసంగం సందర్భంగా క్రికెట్ ముచ్చట
టీమిండియా ఇటీవల ఆస్ట్రేలియా గడ్డపై సాధించిన టెస్టు సిరీస్ విజయం పార్లమెంటులోనూ మార్మోగింది. తన బడ్జెట్ ప్రసంగం సందర్భంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ భారత జట్టు గురించి ప్రస్తావించారు. గెలవాలన్న బలీయమైన కాంక్షను ఆ విజయం ప్రతిబింబించిందని అన్నారు.
అణచివేయలేనంతటి గెలుపు దాహానికి ఇది నిదర్శనమని కొనియాడారు. భారత ప్రజలుగా మనందరికీ ఉన్న నాణ్యమైన లక్షణాలను ఇది గుర్తు చేస్తోందని, ముఖ్యంగా మన యువత భవిష్యత్తు పట్ల అపారమైన భరోసా ఇస్తోందని నిర్మలా సీతారామన్ తెలిపారు. టీమిండియాపై ప్రధాని మోదీ కూడా ప్రశంసలు జల్లు కురిపించిన సంగతి తెలిసిందే.
ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ లో భారత్ 2-1తో నెగ్గిన సంగతి తెలిసిందే. తొలి టెస్టులో దారుణంగా ఓడిన భారత్... ఆపై రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ లేకపోయినా, తాత్కాలిక సారథి అజింక్యా రహానే నాయకత్వంలో అనూహ్యంగా పుంజుకుంది. రెండో టెస్టులో నెగ్గి లెక్క సరిచేసిన భారత్, ఆపై మూడో టెస్టులో అసామాన్య పోరాటపటిమతో డ్రా చేసుకుంది. నిర్ణయాత్మక చివరి టెస్టులో రెట్టించిన పట్టుదలతో ఆడి విజయాన్ని ఖాయం చేసుకుంది.